రివెంజ్‌కు రాజస్తాన్‌ రెడీ.. ఇవాళ ఢిల్లీతో రాయల్స్​ పోరు

రివెంజ్‌కు రాజస్తాన్‌ రెడీ.. ఇవాళ  ఢిల్లీతో రాయల్స్​ పోరు

దుబాయ్: స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ చేరికతో బలంగా తయారైన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌.. లీగ్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌లో కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌పై ప్రతీకారానికి సిద్ధమైంది. బుధవారం ఇక్కడ జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌, ఢిల్లీ ఐపీఎల్‌‌13లో రెండో సారి అమీతుమీ తేల్చుకోనున్నాయి.  ఇప్పటిదాకా లీగ్‌‌లో మూడు విజయాలు సాధించిన రాజస్తాన్‌‌కు ఈ మ్యాచ్‌‌లో విజయం అత్యవసరం. గత వారం ఈ రెండు టీమ్స్‌‌ మధ్య జరిగిన పోరులో ఢిల్లీ 46 రన్స్‌‌ తేడాతో రాయల్స్‌‌ను చిత్తు చేసింది. అయితే లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌కు స్టోక్స్‌‌ లేడు. సన్‌‌ రైజర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో బరిలోకి దిగిన స్టోక్స్‌‌ ఫెయిలైనప్పటికీ రాజస్తాన్‌‌ అతనిపై చాలా నమ్మకంగా ఉంది.  స్టోక్స్‌‌ జట్టులో ఉన్నప్పటికీ రాజస్తాన్‌‌ టాపార్డర్‌‌ గాడిలో పడకపోతే ఇబ్బంది తప్పదు. సీజన్‌‌ స్టార్టింగ్‌‌లో అదరగొట్టిన  స్మిత్‌‌, శాంసన్‌‌ వరుసగా ఫెయిలవుతున్నారు. బట్లర్‌‌ ఫామ్‌‌లో ఉన్నప్పటికీ ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు.  రాహుల్‌‌ తెవాటియా మరోసారి కీలకం కానున్నాడు. ఆర్చర్‌‌, కార్తీక్‌‌ త్యాగి, అంకిత్‌‌ రాజ్‌‌పుత్‌‌ తదితరులతో బౌలింగ్‌‌లో రాజస్తాన్‌‌ ఫర్వాలేదనిపిస్తోంది. కానీ ఢిల్లీ బ్యాట్స్‌‌మెన్‌‌కు కళ్లెం వేయాలంటే వారు మరింత చెలరేగాలి. శిఖర్‌‌ ధవన్‌‌ ఫామ్‌‌లోకి రావడం, పృథ్వీ, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ టచ్‌‌లో ఉండడంతో ఢిల్లీ టాపార్డర్‌‌ బలంగా ఉంది. రిషబ్‌‌ పంత్‌‌ ఈ మ్యాచ్‌‌కు దూరమవ్వగా అలెక్స్‌‌ క్యారీ, హెట్‌‌మయర్‌‌లో అయ్యర్‌‌ ఎవరిని తీసుకుంటాడో, రహానెకు ఇంకో చాన్స్‌‌ ఇస్తాడో లేదో చూడాలి.