ఇవాళ (సెప్టెంబర్ 07) చంద్రగ్రహణం.. తిరుపతి ఆలయం మూసివేత.. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ

ఇవాళ (సెప్టెంబర్ 07) చంద్రగ్రహణం.. తిరుపతి ఆలయం మూసివేత.. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ

హైదరాబాద్, వెలుగు: చంద్రగ్రహణం కారణంగా ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. 

ఆదివారం (సెప్టెంబర్ 07) రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి 1.31 గంటలకు వీడనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీవారి ఆలయంతోపాటు తిరుమలలోని అన్నవితరణ కేంద్రాలను మూసివేయనున్నది. చంద్రగ్రహణం కారణంగా తక్కువ సమయం ఉండటంతో సుమారు 30 వేల నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం కల్పించే వీలు ఉంటుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 

కాగా, గ్రహణ సమయంలో అన్నవితరణ కేంద్రాలు మూసివేస్తుండడంతో  భక్తులకు 50 వేల పులిహోర, బిస్కెట్‌‌‌‌ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. సోమవారం గ్రహణం వీడాక ఆలయంలో శుద్ధి, పుణ్యహవచనం కార్యక్రమం చేసి సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరుచుకుంటాయని చెప్పారు. వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను రద్దు చేశామన్నారు.