ఇవాళ హైదరాబాద్‌కు చావోరేవో..ఓడితే ఇంటికే..

ఇవాళ హైదరాబాద్‌కు చావోరేవో..ఓడితే ఇంటికే..
  • నేడు రాజస్తాన్‌ తో కీలక పోరు
  • ఓడితే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఔట్‌

దుబాయ్‌‌:  స్టార్‌‌ ప్లేయర్లు రాణిస్తున్నా.. యంగ్‌‌స్టర్స్‌‌ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సీజన్‌‌లో తంటాలు పడుతున్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు  మరో కఠిన సవాల్‌‌.  ప్లే ఆఫ్‌‌ రేసులో నిలవాలంటే విజయం అనివార్యమైన వేళ.. గురువారం జరిగే మ్యాచ్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌తో చావోరేవో తేల్చుకోనుంది. తొమ్మిది మ్యాచ్‌‌ల్లో మూడే గెలిచి ఆరింటిలో ఓడిన సన్‌‌రైజర్స్‌‌ పాయింట్స్‌‌ టేబుల్‌‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఈజీగా గెలవాల్సిన  లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా చేతిలో సూపర్‌‌ ఓవర్లో ఓడి డీలా పడ్డ హైదరాబాద్‌‌ ఇప్పుడు పుంజుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఏడో ఓటమి ఎదురైతే  ప్లే ఆఫ్స్‌‌ గురించి మర్చిపోవాల్సి ఉంటుంది. గాయాల కారణంగా స్టార్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ మిచెల్‌‌ మార్ష్‌‌ లీగ్‌‌కు దూరం కావడంతో సరైన కాంబినేషన్స్‌‌ను ఎంచుకోలేక ఆరెంజ్‌‌ ఆర్మీ సతమతమవుతోంది.  అందుబాటులో ఉన్న వనరులతో  బ్యాటింగ్‌‌ బలం పెంచుకోవాలో.. బౌలింగ్‌‌ను బలోపేతం చేసుకోవాలో కెప్టెన్‌‌ వార్నర్‌‌ తేల్చుకోలేకపోతున్నాడు. పైగా, బ్యాటింగ్‌‌ యూనిట్‌‌ మొత్తం జానీ బెయిర్‌‌స్టో, వార్నర్‌‌, మనీశ్‌‌ పాండే, కేన్‌‌ విలియమ్సన్‌‌పైనే భారం ఉంచుతోంది. వీరిలో ఎవరో ఒకరు బాగానే ఆడుతున్నా..  మిడిలార్డర్‌‌ ఇప్పటికీ కుదురుకోకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. ప్రియమ్‌‌ గార్గ్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ అబ్దుల్‌‌ సమద్‌‌ ఇప్పటికైనా బాధ్యత తీసుకోకపోతే జట్టు రాత మారేలా లేదు. కీలక టైమ్‌‌లో బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్‌‌ యూనిట్‌‌ సత్తా చాటాలని వార్నర్‌‌ కోరుకుంటున్నాడు. మరోవైపు రైజర్స్‌‌ మాదిరిగా కుర్రాళ్లపై భారం ఉంచిన రాజస్తాన్‌‌ రాయల్స్‌‌కు కూడా ఈ మ్యాచ్‌‌లో విజయం కీలకం కానుంది. పదింటిలో 4 విజయాలతో రైజర్స్‌‌ కంటే ఓ స్థానం ముందున్న రాయల్స్‌‌ ఈ మ్యాచ్‌‌లో గెలిచి ప్లేఆఫ్‌‌ రేసులో ముందుకెళ్లాలని కోరుకుంటోంది. జోస్‌‌ బట్లర్‌‌, కెప్టెన్‌‌ స్మిత్‌‌ ఫామ్‌‌లో ఉండడం ప్లస్‌‌ పాయింట్‌‌. బౌలింగ్‌‌లో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్‌‌ గోపాల్‌‌, యంగ్‌‌స్టర్‌‌ కార్తీక్‌‌ త్యాగి సత్తా చాటుతున్నారు. అయితే, బెన్‌‌ స్టోక్స్‌‌తో పాటు రాబిన్‌‌ ఊతప్ప మెరుగ్గా పెర్ఫామ్​ చేయాలని కెప్టెన్‌‌ స్మిత్‌‌ ఆశిస్తున్నాడు.