సుగంధ ద్రవ్యాల సాగుపై నేడు సదస్సు

సుగంధ ద్రవ్యాల సాగుపై నేడు సదస్సు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల పంటల సాగును పెంచేందుకు ఉద్యాన శాఖ రైతులకు అవగాహనా కార్యక్రమాలను చేపడుతోంది. మంగళవారం రెడ్‌‌హిల్స్‌‌లోని ఉద్యానశాఖ శిక్షణ కేంద్రంలో రాష్ట్ర స్థాయి రైతు అవగాహన సదస్సును నిర్వహిస్తోంది. నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన 200 మంది ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇవ్వనుంది. అజ్మీర్​లోని జాతీయ విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం(ఎన్‌‌ఆర్‌‌సీఎస్‌‌ఎస్‌‌) సహకారంతో వీరికి శిక్షణ అందించనుంది. నిత్యావసర వస్తువుల్లో వాడే సుగంధ ద్రవ్య పంటలు ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, వాము తదితర 17 రకాలు ఉన్నాయి. వీటిని రాష్ట్రంలో పండించకపోవడంతో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

ఈ పంటల లోటును పూడ్చటానికి 1.15 లక్షల ఎకరాల్లో వీటిని సాగు చేయాలని అధికారులు అంచనా వేశారు. ఈ సాగును ప్రోత్సహించటానికి 2019-–20లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం(ఎంఐడీహెచ్‌‌) ద్వారా 100 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతుల పొలాలు, ఉద్యాన శాఖ నర్సరీల్లో ఏర్పాటు చేసే ఈ ప్రదర్శన క్షేత్రాల్లో ఉండే రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల తెలంగాణ అగ్రికల్చరల్​యూనివర్సిటీ, ఎన్‌‌ఏఏఆర్‌‌ఎం ఉమ్మడిగా చేసిన సర్వే ప్రకారం తెలంగాణలో తలసరి సగటున రోజుకు 21 గ్రాములు, నెలకు 640 గ్రాములు, ఏడాదికి 7.58 కిలోల సుగంధ ద్రవ్యాలలను వాడుతున్నట్టు తేలింది. రాష్ట్రంలో 2.31 లక్షల మెట్రిక్‌‌ టన్నుల సుగంధ ద్రవ్యాలను ఏటా వాడుతున్నారు. వీటి విలువ రూ.1,451 కోట్లు.