
- కరీంనగర్ జిల్లా వీణవంక చల్లూరు పంచాయతీ కార్యదర్శిని..
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు
- ఇంటి నంబర్ కోసం రూ.20 వేలు డిమాండ్
వీణవంక, వెలుగు : ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన కరీంనగర్ జిల్లా చల్లూరు పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఆఫీసర్ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి నంబర్ కేటాయించాలని గ్రామపంచాయతీలో అప్లై చేసుకున్నాడు. నంబర్ కేటాయించేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ నాగరాజు డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
వారి సూచన మేరకు శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో సెక్రటరీ నాగరాజును కలిసి రూ. 20 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సెక్రటరీ నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు. కాగా, పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఏసీబీకి పట్టుబడడంతో గ్రామస్తులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.