కరీంనగర్‏లో చెరువులు, కుంటలు ఫుల్‌‌‌‌.. భారీ వర్షాలతో జిల్లాకు జళకళ

కరీంనగర్‏లో చెరువులు, కుంటలు ఫుల్‌‌‌‌.. భారీ వర్షాలతో జిల్లాకు జళకళ
  • ఇటీవల కురిసిన వానలతో రిజర్వాయర్లు, వాగుల్లోకి భారీ వరద 

జగిత్యాల/కరీంనగర్‌‌‌‌‌‌‌‌/సిరిసిల్ల/పెద్దపల్లి,  వెలుగు: ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి. గోదావరి నదితోపాటు,  వాగులు, వంకలు ఉధృతంగా పారుతున్నాయి. శ్రీరాంసాగర్‌‌‌‌ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో నీటి నిల్వ 60 టీఎంసీలు దాటింది. వీటితోపాటు ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన ప్రాజెక్టులైన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎగువ మానేరు, మిడ్‌‌‌‌ మానేరు, లోయర్‌‌‌‌‌‌‌‌ మానేరు డ్యాంలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ మానేరు, మిడ్‌‌‌‌ మానేరు రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేస్తుండగా ఎల్‌‌‌‌ఎండీకి భారీ ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లకు సాగునీరు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నిండుకుండలుగా 1,917 చెరువు, కుంటలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,983 చెరువులు, కుంటలు ఉండగా, 1,917 చెరువులు నిండుకుండలా మారాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1,328 చెరువులు, కుంటలు ఉండగా.. 263 చెరువు, కుంటలు మత్తళ్లు పోస్తున్నాయి. 629 నిండే దశలో ఉండగా, మరో 178 చెరువు కుంటలు సగానికి పైగా నిండాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 1,072 ఉండగా, 557 పూర్తిగా నిండాయి. 292 చెరువుల్లో 50 శాతం పైనే నిండాయి. పెద్దపల్లి జిల్లాలో 927 చెరువులు, కుంటల్లో సుమారు 129 అలుగులు దుంకుతున్నాయి. 234 నిండే దశలో ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 656 చెరువులుండగా, 105 చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. 

రిజర్వాయర్లలోకి భారీగా వరద 

ఉమ్మడి జిల్లాలోని ఎల్లంపల్లి, ఎగువ, మిడ్‌‌‌‌, లోయర్‌‌‌‌‌‌‌‌మానేరు రిజర్వాయర్లకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ మానేరులోకి పాల్వంచ, కూడెల్లి వాగుల నుంచి 37 వేల క్యూసెక్కులు  వరద వస్తోంది. మిడ్ మానేరులోకి ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్పీ నుంచి 12 వేల క్యూసెక్కులు, మూలవాగు, మానేరు వాగుల నుంచి 40 వేల క్యూసెక్కులు వరద వచ్చి చేరుతోంది. మిడ్‌‌‌‌మానేరు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27టీఎంసీలు కాగా.. శుక్రవారం సాయంత్రానికి 23.69టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా ఎల్‌‌‌‌ఎండీకి 10 వేల క్కూసెక్కులు, అన్నపూర్ణ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు 9,600 క్కూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. 

1,082 ఎకరాల్లో పంట నష్టం

ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 1,082 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని బొమ్మల చెరువు కట్ట తెగిపోవడంతో 50 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలో దాదాపు 471 ఎకరాల్లో పంట నష్టం కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 561 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో పలు చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.