ఒలింపిక్స్ లో  సెమీస్‌కు చేరిన హాకీ జట్టు

ఒలింపిక్స్ లో  సెమీస్‌కు చేరిన హాకీ జట్టు

టోక్యో: ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తూ సెమీస్ కు చేరుకుంది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ను కట్టడి చేస్తూ.. ఆది నుంచి అటాకింగ్ తో ముప్పేట దాడి చేసి విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం ఎక్కడా బ్రిటన్ ఆధిక్యానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. ఏడో నిమిషంలోనే దిల్ ప్రీత్ సింగ్ గోల్ చేయగా.. రెండ్ క్వార్టర్ లో 16వ నిమిషంలో గుర్జత్ సింగ్ మరో గోల్ సాధించాడు. టీ బ్రేక్ టైమ్ కు భారత్  2-0 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచింది. 45 నిమిషం వద్ద బ్రిటన్ ఒక గోల్ సాధించింది. దీంతో మూడో క్వార్టర్ పూర్తయ్యే సరికి స్కోర్ 2 – 1 తేడాగా మారింది. దీంతో నాలుగో క్వార్టర్ లో 57వ నిమిషంలో హార్దిక్ సింగ్ మూడో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం పెరిగి మూడో  విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. 
49ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
 దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం హాకీ క్రీడలో భారత్ ప్రపంచ మేటి జట్టుగా ఉండేది. చివరి సారి 1980లో పతకం సాధించిన తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. అప్పటి నుంచి ఒలింపిక్స్ లో అడుగు పెడితే చాలన్నట్లుగా ప్రదర్శన ఉండేది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో మన్‌ప్రీత్ సేన 3-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్ లో భారత జట్టు సెమీస్‌కు చేరడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1972లో చివరిసారి భారత జట్టు ఒలింపిక్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్ దాటలేదు. 1980 ఒలింపిక్స్ లో భారత జట్టు స్వర్ణం సాధించినప్పటికీ ఆ తర్వాత నుండి ప్రాభవం కనుమరుగవుతూ వచ్చింది.  సెమీ ఫైనల్ కు చేరిన భారత జట్టు ఈ నెల 3న బెల్జియంతో తలపడనుంది.