బంపర్‌‌ ఆఫర్: ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్ సాధిస్తే 6 కోట్లు

బంపర్‌‌ ఆఫర్: ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్ సాధిస్తే 6 కోట్లు

లక్నో: జపాన్‌లోని టోక్యోలో జులై 23 నుంచి జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్తున్న క్రీడాకారులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ రాష్ట్ర నుంచి వెళ్తున్న క్రీడాకారుల్లో ఎవరైనా వ్యక్తిగత కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధిస్తే రూ.6 కోట్లు, అదే టీమ్ ఈవెంట్స్‌లో గోల్డ్ వస్తే ఒక్కొక్కరికీ రూ.3 కోట్లు చొప్పున ప్రభుత్వం తరఫున ప్రైజ్ మనీ అందిస్తామని చెప్పారు. అలాగే ఈ ఒలింపిక్స్‌లో ఆడడానికి యూపీ నుంచి వెళ్తున్న  అథ్లెట్‌కు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒలింపిక్స్‌లో యూపీ నుంచి షూటర్స్ సౌరభ్ చౌదరి (19), మైరాజ్ ఖాన్, జావెలిన్‌ త్రో స్టార్స్ శివ్‌పాల్ సింగ్, అన్నూ రాణి పాల్గొనబోతున్నారు.
గత ఏడాదిలోనే జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జులై 23 నంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. మన దేశం నుంచి మొత్తం 126 మంది అథ్లెట్స్‌ వెళ్తున్నారు. ఒలింపిక్స్ ఓపెనింగ్ వేడుకల్లో మన దేశం తరఫున బాక్సర్ మేరీ కోమ్, హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ జాతీయ జెండానను పట్టుకుని మన అథ్లెట్స్ ముందుండి బ్లాగ్ బేరర్స్‌గా నడుస్తారు. ముగింపు వేడుకల్లో రెజ్లర్ బజరంగ్‌ పునియాకు ఈ అవకాశం దక్కనుంది.

రూ.3 కోట్లు ప్రకటించిన ఢిల్లీ, తమిళనాడు

ఒలింపిక్స్‌లో మెడల్స్‌ సాధిస్తే క్యాష్‌ ప్రైజ్ ఇస్తామని ఇప్పటికే ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న వాళ్లలో ఎవరైనా బంగారు పతకం సాధిస్తే రూ.3 కోట్లు, వెండి మెడల్ సాధిస్తే రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే రూ. కోటి చొప్పున ఇస్తామని ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, స్టాలిన్ ప్రకటించారు. అలాగే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రతి అథ్లెట్‌కు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు.