టోల్ ప్లాజాల్లో జీతాల కిరికిరి

టోల్ ప్లాజాల్లో జీతాల కిరికిరి
  • వేతనాల తగ్గింపుపై కొత్త కాంట్రాక్టు ఏజెన్సీ సంకేతాలు
  • ఆందోళన బాటలో ఐదు టోల్ ప్లాజాల ఎంప్లాయిస్కొ
  • కొనసాగుతున్న రిలే దీక్షలు

నిర్మల్, వెలుగు: నేషనల్ హైవే నంబర్ 44పై ఉన్న ఐదు టోల్ ప్లాజాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనబాట పట్టారు. వేతనాల తగ్గింపు విషయంలో వీరంతా కొద్ది రోజులుగా ఇక్కడి టోల్ ప్లాజా వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. 2009 నుంచి తాము టోల్ ప్లాజాల్లో పనిచేస్తున్నామని, అయితే అప్పటి కాంట్రాక్టర్ తమకు పనికి తగ్గ వేతనం చెల్లించేవా రని, అయితే కొత్తగా టెండర్​ దక్కించుకున్న కంపెనీ సిబ్బంది జీతాలు తగ్గిస్తామని సంకేతాలు ఇవ్వడంతో ఆందోళన బాటపట్టారు.

టెండర్ ​విధానంలో కొత్త కంపెనీకి బాధ్యతలు

ప్రస్తుతం కాంట్రాక్ట్ ఏజెన్సీ గడువు ముగియడంతో కొద్దిరోజులుగా ఎన్ హెచ్ఎఐ ఈ టోల్ ప్లాజాల నిర్వహణ చేపడుతోంది. ఇటీవలే టోల్ ప్లాజాల నిర్వహణ బాధ్యతను టెండర్ విధానంతో ప్రైవేట్ కంపెనీ దక్కించుకుంది. కొద్ది రోజుల్లోనే ఈ ఐదు టోల్ ప్లాజాల నిర్వహణను ఆ కంపెనీ చేపట్టబో తోంది.  సబ్ కాంట్రాక్ట్ పేరిట మరో రెండు  కంపెనీలకు నిర్వహణను ఔట్​సోర్సింగ్ విధానంలో అప్పగించినట్లు సమాచారం. మనోహరాబాద్, బిక్ నూర్ టోల్ ప్లాజాల నిర్వహణను టీబీఆర్ కంపెనీకి అలాగే గంజాల్, రోల్ మామడ, పిప్పలవాడ టోల్ ప్లాజాల నిర్వహణను ఫైర్వేస్ కంపెనీకి ఇచ్చినట్లు సిబ్బంది చెప్తున్నారు. 

రూ.29 వేలు ఇచ్చేవారికి రూ.18 వేలే!

ఇప్పటివరకు నిర్వహణ చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీ సిబ్బందికి గరిష్టంగా రూ.29 వేల నుంచి కనిష్టంగా రూ.16 వేల వరకు వేతనాలు చెల్లించేది. అయితే లేబర్​ యాక్ట్​ ప్రకారం.. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్​ స్కిల్డ్​విధానంలో జీతాలు ఇస్తామని కొత్త కంపెనీ స్పష్టమైన సంకేతాలు పంపింది. ఈ యాక్ట్ ప్రకారం స్కిల్డ్ ఎంప్లాయిస్ కు రూ.18 వేలు, సెమీ స్కిల్డ్ ఎంప్లాయిస్ కు రూ.15 వేలు, అన్ స్కిల్డ్ ఎంప్లాయిస్​కు రూ.13 వేల వేతనం మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలోనే ఈ ఐదు టోల్​ప్లాజాల్లో పనిచేసే దాదాపు 500 ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాటపడ్డారు. తమ వేతనాలను పెంచాల్సింది పోయి తగ్గించేందుకు ప్రయత్నిస్తుండడం సమంజసం కాదని మండిపడుతున్నారు. తమ జీతాలు తగ్గించకుండా చూడాలంటూ శుక్రవారం సెంట్రల్ లేబర్ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. రామగుండంలోని లేబర్ కమిషనర్​కు సైతం వినతి పత్రం అందజేశారు.