ఏప్రిల్​ 1 నుంచి టోల్​ట్యాక్స్ పెంపు!

ఏప్రిల్​ 1 నుంచి టోల్​ట్యాక్స్ పెంపు!

న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వే లపై ప్రయాణం మరింత భారం కానుంది. వచ్చే నెల నుంచి టోల్​ ట్యాక్స్ పెంచేందుకు నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. కార్లతో పాటు ఇతరత్రా తేలికపాటి వాహనాలకు ఇప్పుడు వసూలు చేస్తున్న పన్నులపై 5%, లారీలు, ట్రక్కుల వంటి భారీ వాహనాలకు 10% పెంచనున్నట్లు సమాచారం. నెలవారీగా జారీ చేసే పాస్ ల ధరలు కూడా పెరగనున్నాయి. నేషనల్​ హైవేస్ ఫీ రూల్స్ చట్టం 2008 ప్రకారం.. ట్యాక్స్ టారిఫ్​ను ఏటా సవరించుకునే వెసులుబాటు ఉంది.

దీంతో తాజాగా పన్ను రేట్లను సవరిస్తూ ఎన్ హెచ్ఏఐ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ నెల 25 లోగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్​ యూనిట్(పీఐయూ) కు పంపిస్తుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం లభించగానే అమలులోకి తీసుకొస్తుంది. పెరిగిన పన్ను రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని అధికారవర్గాల సమాచారం. కాగా, జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వే లపై ప్రయాణించే వాహనాల నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ ను ఎన్ హెచ్ఏఐ గతేడాదే పెంచింది. అన్ని వాహనాలపైనా రూ.10 నుంచి రూ.60 వరకు ట్యాక్స్ పెంచేసింది.