టాలీవుడ్ సినీ నటుడు, పాస్టర్ మరిపూడి జోసెఫ్ గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం (2025 డిసెంబర్ 4న) చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా.. మార్గమధ్యలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.
అందరినీ నవ్వించే పాస్టర్ జోసెఫ్.. ఇలా సడెన్గా 47 ఏళ్ళ వయసులోనే చనిపోవడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ క్రమంలో పాస్టర్ జోసెఫ్ మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, సినీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
పాస్టర్ జోసెఫ్ సినిమాల విషయానికి వస్తే.. సీనియర్ ఎన్టీఆర్తో కలిసి ‘పాతాళభైరవి' సహా మరో ఆరు సినిమాల్లో నటించారు. కృష్ణ, కృష్ణంరాజు, కమలహాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
►ALSO READ | టాలీవుడ్ సినిమాలకు షాకుల మీద షాకులు.. మొన్న అఖండ 2.. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ !
సినిమాల్లోనే కాకుండా.. పాస్టర్ గాను ఎన్నో వేదికలపైనా తనదైన హాస్యాన్ని పండించారు. ఎన్నో నవ్వులు పూయించిన పాస్టర్ జోసఫ్.. ఇపుడు మూగబోయిన జ్ఞాపకంగా మారి అభిమానుల్లో విషాదం మిగిల్చారు.
పాస్టర్ జోసెఫ్ ప్రస్థానం:
పాస్టర్ జోసెఫ్.. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందినవాడు. ఆయన మరిపూడి సుబ్బారావు, సుబ్బలక్ష్మిల ఏకైక కుమారుడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత.. ఉంగుటూరు మండలం చేబ్రోలులో పాస్టర్ యోబు దగ్గరకు వెళ్లి అక్కడే ఉండి ఆయన వద్ద శిష్యుడిగా కొనసాగారు. ఆపై సినిమాల్లో అవకాశం రావడంతో జోసెఫ్ తనదైన పాత్ర పోషించారు.
