
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్లో విషాద ఘటన జరిగింది. సినీ నటి సోహానీ కుమారి కాబోయే భర్త సవాయి సింగ్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లోని తన ఫ్లాట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఊహించని ఈ ఘటనతో సోహాని కుమారి శోక సంద్రంలో మునిగిపోయింది. ఆత్మహత్యకు ముందు సవాయి సింగ్ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. తాను గతంలో చేసిన తప్పులే తనకు ఈ పరిస్థితి తీసుకొచ్చాయని సవాయి సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజస్తాన్కు చెందిన సోహానీ కుమారి రెండు మూడు సినిమాల్లో నటించింది. సవాయి సింగ్తో ఇన్ స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు ఈ స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి గతేడాది జులైలో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో ఒక రెంటెడ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని సహ జీవనంలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ సవాయి సింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
Also Read ; ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
సవాయి సింగ్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో నటి సోహానీ ఇంట్లో లేదు. ఆమె ఇంటికి తిరిగొచ్చే సరికి డైనింగ్ రూంలో తన బాయ్ ఫ్రెండ్, కాబోయే భర్త ఉరేసుకుని కనిపించాడు. ఈ పరిణామంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సోహానీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పాట్కు చేరుకుని సవాయి సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో పోలీసులకు ఈ సెల్ఫీ వీడియో మెసేజ్ లభ్యమైంది.
సవాయి సింగ్ తన మాజీ ప్రియురాలిని మర్చిపోలేని స్థితిలో ఉన్నాడని, ఆర్థిక సమస్యల కారణంగా ఒత్తిడిలో ఉన్నాడని సోహానీ కుమారి పోలీసులకు చెప్పింది. ఈ కారణాల వల్లే సవాయి సింగ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సోహాని అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు సవాయి సింగ్ మాజీ ప్రియురాలిని కూడా కేసు దర్యాప్తులో భాగంగా విచారించాలని నిర్ణయించారు.