క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు

V6 Velugu Posted on Oct 25, 2021

హైదరాబాద్: తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు(64) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు. 
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు.  ఆయన నిర్మాతగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో "స్వర్గం -నరకం ", "రాధమ్మ పెళ్లి " సినిమాలను నిర్మించారు.  రాజబాబు కు వ్యవసాయం చెయ్యడమన్నా, కబడ్డీ ఆడటమన్నా , రంగస్థలం మీద నటించడమన్నా ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ  దేశమంతా తిరిగారు.

దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును 1995లో  “ఊరికి మొనగాడు ” అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆనతి కాలంలోనే రాజబాబు ,  సముద్రం, ఆడవారి మాటలకు  అర్ధాలే వేరులే , మురారి ,శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సముద్రం, కళ్యాణ వైభోగం , మళ్లీ రావా ?, శ్రీకారం , బ్రహ్మోత్సవం , భరత్  మొదలైన  62 చిత్రాల్లో  విభిన్నమైన పాత్రలను పోషించారు. 
టీవీ రంగంలో కూడా  48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు.  వసంత కోకిల, అభిషేకం , రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం , చి ల సౌ స్రవంతి ,ప్రియాంక సీరియల్స్  లో పోషించిన పాత్రలు రాజబాబు కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. 2005వ సంవత్సరంలో  "అమ్మ " సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. తెలుగు దనాన్ని తెరమీద పంచి తెర మెరుగైన రాజబాబు తన పాత్రల ద్వారా ఎప్పటికీ చిరంజీవిగా వుంటారు.

Tagged Actor, tollywood, Character actor, Rajababu, telugu artist, cinema artist

Latest Videos

Subscribe Now

More News