సమ్మర్​ లో స్టార్ వార్​

సమ్మర్​ లో స్టార్ వార్​

కొవిడ్ ఎఫెక్ట్ మొదలయ్యాక సినిమాలకి కష్టాలు మొదలయ్యాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం మాటిమాటికీ వాయిదా పడుతున్నాయి. కొత్త రిలీజ్‌‌ డేట్స్ ప్రకటించినా, అనుకున్న తేదీకి రాలేక అవస్థపడుతున్నాయి. రెండు వేవ్స్ కారణంగా వచ్చిన ఈ ఇబ్బంది థర్డ్ వేవ్‌‌లోనూ రిపీటవుతోంది. భారీ సినిమాల విడుదల తేదీలన్నీ అటూ ఇటూ మారిపోతూనే ఉన్నాయి. నిన్న ఒకేసారి పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల విషయంలో ఇది జరిగింది. ఎన్టీఆర్, రామ్‌‌ చరణ్‌‌ హీరోలుగా రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్యాన్‌‌ ఇండియా మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ విషయంలో ఇప్పటికే పలుసార్లు మార్పులు జరిగాయి. నిజానికి జనవరి 7ను రిలీజ్‌‌ డేట్‌‌గా ఫైనల్‌‌ చేసి ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ కరోనా కేసులు పెరగడంతో మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న రిలీజ్‌‌ చేస్తామని ఈమధ్యనే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ రెండు డేట్స్‌‌ని కాదని మరో కొత్త తేదీని ఫిక్స్ చేశారు. మార్చి 25న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్‌‌ చేశారు. ఈ మార్పుతో మిగతా సినిమాల రిలీజ్‌‌ డేట్స్‌‌లోనూ కీలక మార్పులు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనౌన్స్‌‌మెంట్‌‌ వచ్చిన కాసేపటికే ‘ఆచార్య’ రిలీజ్‌‌ డేట్‌‌ను కూడా మారుస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్‌‌ 1న విడుదల కావాల్సిన ఈ మూవీని ఏప్రిల్‌‌ 29కి వాయిదా వేశామని, మ్యూచువల్ అండర్‌‌‌‌స్టాండింగ్‌‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ మూవీ మేకర్స్ చెప్పారు. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘ఎఫ్‌‌3’ని ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ 28నే విడుదల చేయబోతున్నట్టు దిల్ రాజు నిర్థారించారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌‌ ‘భీమ్లా నాయక్‌‌’ సినిమా కూడా కొత్త నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించినట్టు ఫిబ్రవరి 25న రావడానికే ప్రయత్నిస్తామని.. ఒకవేళ వీలు కాకపోతే ఏప్రిల్‌‌ 1న రిలీజ్ చేస్తామని చెప్పింది. ఏదేమైనా ఒకేరోజు ఇలా ఇంతమంది స్టార్ హీరోల సినిమాల విడుదల విషయంలో మార్పులు జరగడం ఊహించని విషయం.