
స్టార్ హీరోల సినిమాల మొదలు చిన్న చిత్రాల వరకూ మైత్రి మూవీస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్‌లో వారు నిర్మించిన ‘డ్యూడ్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇలా ముచ్చటించారు.
ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. పెయిన్‌ఫుల్ ఎమోషన్స్‌తో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూశాక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతోందో సహజంగా గెస్ చేస్తుంటాం. కానీ ఆ ఊహకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ‘డ్యూడ్’ అనేది ఈ కథకు యాప్ట్ టైటిల్. మంచి క్వాలిటీ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. కథ చెప్పిన దానికంటే కూడా దర్శకుడు బాగా తీశారు. అలాగే సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, తమిళ్‌తో సమానంగా తెలుగులో ఆడుతుందనే నమ్మకం ఉంది.
ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. ‘సఖి’ తరహా ఫ్యామిలీ మూవీ. యూత్ ఫుల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ప్రదీప్ గత చిత్రం అక్కడ దాదాపు రూ.31 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు దీపావళి సీజన్ కనుక టాక్ బాగుంటే అద్భుతమైన షేర్ వస్తుందని నమ్ముతున్నాం. తమిళంలో మరో కొత్త కథ విన్నాం. త్వరలో కొత్త వాళ్లతో చేయబోతున్నాం.
ప్రభాస్, ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయి. ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కన్‌ఫర్మ్. ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్‌కు ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. ‘పెద్ది’ అవగానే సుకుమార్‌తో సినిమా ఉంటుంది. హిందీ చిత్రం ‘జాట్’కు సీక్వెల్ చేయబోతున్నాం. ఇక మిగతా భాషలతో పోల్చితే మన తెలుగు ఇండస్ట్రీలో రెమ్యునరేషన్స్ చాలా బెటర్‌గా ఉన్నాయి. అందువల్ల మనం ప్రొడక్షన్‌పై ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నాం.