రూపాయికే కిలో టమాట

రూపాయికే కిలో టమాట

భైంసా మార్కెట్‌లో రైతుకు దక్కిన ధర ఇంతే

కడుపు రగిలి పశువులకు పారబోసిన అన్నదాత

కూరగాయలు సాగుచేయాలని సూచిస్తున్న ప్రభుత్వం

మద్దతు ధర కల్పించడంలో మాత్రం విఫలం

వాణిజ్య పంటలకు బదులు కూరగాయలు సాగుచేయమని చెబుతున్న ప్రభుత్వం, తీరా వాటికి మద్దతు ధర దక్కేలా చూడడంలో మాత్రం విఫలమవు తోంది. దళారుల కారణంగా రైతులకు లాభాల సంగతేమోగానీ కూరగాయలు తెంపి మార్కెట్‌కు తెచ్చిన ఖర్చులు కూడా వస్తలేవు. తాజాగా మార్కెట్‌లో టమాట రేటు దారుణంగా పడిపోయింది. నిర్మల్ జిల్లా భైంసాలోని గాంధీ గంజ్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క సారిగా టమాట బీట్ ధర కిలోకు ఒక్క రూపాయికి చేరడంతో కడుపుమండిన రైతులు పశువులకు పారవోసిన్రు.

నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలోని గాంధీ గంజ్​లో కూరగాయల బీట్​ వద్ద కనిపిస్తున్న ఈ దృశ్యం టమాటా రైతుల గోసను కళ్ల గడుతోంది. శుక్రవారం వ్యాపారులు కిలో టమాటా ధరను రూ. 1గా నిర్ణయించడంతో చేసేదేమి లేక అక్కడే ఉన్న పశువులకు ఇలా పారపోశారు. పెట్టుబడిని పక్కనపెడితే కనీసం టమాటలు తెంపిన కూలీల ఖర్చులు, ట్రాన్స్​పోర్ట్​ ఖర్చులు కూడా మీదపడుతున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

భైంసా, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలోనూ టమాట ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొద్దిరోజులుగా మార్కెట్‌కు దిగుబడులు ఎక్కువగా వస్తుండడంతో కుమ్మక్కయిన దళారులు ధరను ఒక్కసారిగా తగ్గించారు. చాలా మార్కెట్లలో శుక్రవారం రైతుల నుంచి కిలోకు రూ.1 నుంచి రూ.4 లోపే కొన్నారు. వారుమాత్రం జనానికి రూ.10కి తగ్గకుండా అమ్ముకుంటున్నారు.  భైంసా మార్కెట్​లో రైతుల నుంచి కిలో రూపాయికే కొంటామని చెప్పడంతో వ్యాపారులకు అమ్మడం ఇష్టం లేక పశువులకు మేతగా వేశారు.

ప్రభుత్వం పట్టించుకోదా?

కొంతకాలంగా వాణిజ్యపంటలకు బదులు కూరగాయలు పండించాలని సర్కారు పదే పదే ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే చాలా చోట్ల రైతులు కూరగాయల సాగువైపు మళ్లుతున్నారు. ఉదాహరణకు ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఈసారి ఏకంగా 12వేల ఎకరాల్లో టమాట సాగు చేశారు. నిర్మల్, ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్, ముథోల్, కాగజ్​నగర్ తదితర ప్రాంతాల్లో సాగయ్యే టమాటను రైతులు వాహనాల్లో జిల్లాతోపాటు ముఖ్య నగరాలకు తరలిస్తున్నారు. కానీ తీరా అక్కడకు వెళ్లాక వ్యాపారులు రోజుకో తీరున ధరలు నిర్ణయిస్తూ, రైతులను నిండా ముంచుతున్నారు.

ఎకరాకు రూ.50వేల పెట్టుబడి..

కాలమేదైనా మార్కెట్​లో టమాటాకు మంచి డిమాండ్​ ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో దిగుబడి అధికంగా వస్తుంది గనుక సహజంగా ధర తగ్గుతుంది. కానీ గతంలో ఎప్పడూ ఈ స్థాయిలో రేట్లు పడిపోలేదని రైతులు అంటున్నారు. తాము ఎకరా టమాట సాగుకు రూ.50వేల దాకా పెట్టుబడి పెడుతున్నామనీ, కూలీలతో తెంపించి, ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు భరించి మార్కెట్​కు తీసుకెళ్తే దళారులు నిండాముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వపరంగా కూరగాయల రైతులకు ఎలాంటి భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు, ఆఫీసర్లు మార్కెట్‌లో మద్దతు ధర కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనీసం పంట ఎక్కువగా ఉన్నప్పుడు దాచుకునేందుకు సరైన కోల్డ్​ స్టోరేజీలు లేవు. పాత ఆదిలాబాద్​జిల్లా టమాట సాగుకు పెట్టింది పేరు కాగా, ఎక్కడా కోల్డ్​ స్టోరేజీలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

రోడ్డు పొడువునా టమాటాలు..

మెదక్​జిల్లా నర్సాపూర్ – హైదరాబాద్ రూట్‌లో రోడ్డు పక్కన అనేక చోట్ల టమాట కుప్పలు దర్శనమిస్తున్నాయి. శివ్వంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద విస్తీర్ణంలో టమాట సాగుచేశారు. ధర అమాంతం పడిపోవడంతో ఇదిగో ఇలా రోడ్డు పక్కన కోతులు, పశువులకు టమాటలు వేస్తున్నారు.

పసులకు పారబోసిన..

భైంసా మార్కెట్లో శుక్రవారం బీట్‌కు మబ్బుల 3గంటలకు వచ్చిన. అప్పటికే మార్కెట్​ టమాటతో నిండింది. అంతే వ్యాపారులు, దళారులు టమాట ధరలను మొత్తం తగ్గించిన్రు. ఏకంగా కిలో ఒక్క రూపాయే అని చెప్పిన్రు. ఇన్నాళ్లు కష్టపడి వాళ్లకెందుకు లాభం చేయాల్నని పసులకు పారబోసిన.

– సాయినాథ్, దేగాం, టమాట రైతు

ఇదెక్కడి అన్యాయం..?

ఎకరంలో టమాట వేసిన. రూ. 50వేల వరకు పెట్టుబడి పెట్టిన. ధర మంచిగస్తదని అనుకున్న. కానీ రూపాయికి కిలో కొంటామంటున్నరు. కనీసం తెంపిన కూలి, ఆటో ఖర్చులు కూడా ఎల్తలేవు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ధరలు తగ్గించిన్రు. ఇదెక్కడి అన్యాయం? టమాట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలె.

– బాబురావు, మచ్కల్, టమాట రైతు