రెడ్ హాట్ త‌గ్గేదేలా.. కిలో ట‌మాటా రూ.155

రెడ్ హాట్ త‌గ్గేదేలా.. కిలో ట‌మాటా రూ.155

దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యులకు కన్నీళ్లు ఇస్తున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో టమాటా కిలో రూ. 155 గా నమోదైంది. ఇటీవలి కాలంలో అకాల వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.

మెట్రోలలో, రిటైల్ టమాటా ధరలు కిలోకు రూ. 58-148 వరకు పలుకుతున్నాయి. కోల్‌కతాలో అత్యధికంగా రూ. 148, ముంబైలో అత్యల్పంగా కిలోకు రూ. 58 ఉంది. ఢిల్లీ, చెన్నైలలో కిలో ధరలు వరుసగా రూ.110, రూ.117గా ఉన్నాయి. ఒడిశాలో కిలో ధర రూ.100గా ఉండగా... పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కిలోకు అత్యధికంగా రూ. 155గా నమోదైందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా వెల్లడించింది.

ఇదిలా ఉండగా దేశ రాజధానిలో క్వాలిటీ, లోకాలిటీని బట్టి కిలోకు రూ.120-140 గా ఉన్నాయి. "మేము ఆజాద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్ నుంచి కిలోకు రూ. 120 చొప్పున బెస్ట్ క్వాలిటీ గల టమోటాను కొనుగోలు చేశాము. రిటైల్‌లో కిలో రూ. 140కి విక్రయిస్తున్నాము" అని పశ్చిమ విహార్‌లోని ఓ లోకల్ వ్యాపారి తెలిపారు.

రాంచీ, జార్ఖండ్‌లో కూడా పెరిగిన టమాటా ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని చోట్లా టమాటా ధరలు పెరిగాయి. ప్రస్తుతం టమాటా కంటే పెట్రోల్‌ చౌకగా ఉంది. ఇప్పుడు ఖర్చులు నిర్వహించడం మాకు చాలా కష్టంగా మారింది' అని రాంచీకి చెందిన ఓ కస్టమర్‌ తెలిపారు.