ఇయ్యాల ఢిల్లీకి బీజేపీ సీనియర్ నేతలు

ఇయ్యాల ఢిల్లీకి బీజేపీ సీనియర్ నేతలు

హైదరాబాద్, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, మరి కొందరు సీనియర్ నేతలు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. 25న కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతల సమక్షంలో ఆ పార్టీ చేరనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసు ఇచ్చిన అంశం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఢిల్లీ పెద్దలను కలిసి రాష్ట్ర నేతలు వివరించే చాన్స్​ ఉంది.

ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బీజేపీ శిక్షణా తరగతులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జాతీయ నేతలకు వివరించనున్నారు. ఇతర పార్టీల నేతల చేరికలపై కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. 28 నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు జాతీయ నేతలను ఆహ్వానించే విషయంపై కూడా హైకమాండ్ తో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.