పింప్రీలో ఒమిక్రాన్ ఎలా బయటపడిందంటే?

పింప్రీలో ఒమిక్రాన్ ఎలా బయటపడిందంటే?

పూనే : దేశంలో ఒమిక్రాన్ కేసులు 38కి చేరాయి. వీటిలో అత్యధికంగా 18 మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. తాజాగా పింప్రీ చించ్వాడ్ లో ఓ కుటుంబానికి కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. 12 ఏళ్ల బాలికను పంటినొప్పి ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లగా వైరస్ విషయం బయటపడింది.

చించ్వాడ్ కు చెందిన ఓ కుటుంబం నవంబర్ 24న నైజీరియా నుంచి ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ ఫ్యామిలీకి చెందిన 12 ఏళ్ల బాలిక కొన్ని రోజులుగా పంటి నొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు దగ్గరలోని డెంటిస్ట్ వద్దకు తీసుకెళ్లారు. వారు నైజీరియా నుంచి వచ్చిన విషయం తెలుసుకున్న డాక్టర్ ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే ట్రీట్ మెంట్ ఇస్తానని తేల్చిచెప్పాడు. దీంతో సదరు బాలికకు పరీక్ష చేయించగా.. కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆమెకు ఒమిక్రాన్ వేరియెంట్ సోకినట్లు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేయించగా.. మరో నలుగురికి పాజిటివ్ వచ్చింది. వైరస్ సోకిన వారిలో 18 నెలల చిన్నారి కూడా ఉన్నారు.

నైజీరియా నుంచి వచ్చిన వెంటనే బాలిక కుటుంబ సభ్యులకు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. బాలికకు వైరస్ సోకినట్లు తేలిన తర్వాత మరోసారి వారికి పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్థారణ అయింది. విషయం తెలిసిన వెంటనే వైద్యాధికారులు కుటుంబసభ్యులందరినీ జీజామాతా హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హై రిస్క్ కేటగిరీ దేశాల నుంచి వచ్చిన వారందరికీ తప్పనిసరిగా టెస్ట్ లు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారికి లక్షణాలను బట్టి ఇంట్లోనే క్వారంటైన్ చేస్తున్నామని, తీవ్రత ఎక్కువగా ఉంటే హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సదరు కుటుంబ సభ్యులకు 14 రోజుల తర్వాత కోవిడ్ టెస్ట్ నిర్వహించి డబుల్ నెగిటివ్ వచ్చిన తర్వాతే డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు.