
న్యూఢిల్లీ: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా వివాదస్పద వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి విజయ్ షా వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతో సిట్ ఏర్పాటు చేయాలని, ముగ్గురు ఐపీఎస్‌ల సిట్ బృందంలో ఒక మహిళా ఐపీఎస్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 2025, మే 28లోగా నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది.
ఆపరేషన్ సిందూర్ గురించి మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వడం ద్వారా కల్నల్ సోఫియా ఖురేషి దేశవ్యా్ప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఆమెపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాద సోదరి అని అన్నారు. మంత్రి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు మంత్రి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి.. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రి విజయ్ షాపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను విజయ్ షా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విజయ్ షా పిటిషన్‌పై సోమవారం (మే 19) జస్టిస్ సూర్యకాంత్, ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కోర్టు ఆదేశాల మేరకే మంత్రి క్షమాపణలు చెప్పారని.. ఇది నిజాయితీగల క్షమాపణ కాదని అన్నారు.
చట్టపరమైన చర్యల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు తరచుగా మొసలి కన్నీళ్లు కారుస్తారంటూ.. కల్నల్ సోఫియాపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి చెప్పిన క్షమాపణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటివరకు మీ కఠినమైన వ్యాఖ్యలకు నిజాయితీగా క్షమాపణ చెప్పకుండా మిమ్మల్ని ఏ శక్తి నిరోధించిందని ప్రశ్నించింది.
మాకు మీ క్షమాపణ అవసరం లేదని.. చట్టం ప్రకారం ఎలా వ్యవహరించాలో మాకు తెలుసని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని మొట్టికాయలు వేశారు. బాధ్యతగా ఉండాలని హితవు పలికారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే.. ఈ కేస్ స్టేటస్ ఏంటని పోలీసులను అడిగింది.