- ఇజ్రాయెల్ దాడుల్లో ఇబ్రహీం అఖీల్ సహా 12 మంది మృతి
- ఇజ్రాయెల్‌పైకి 140 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా
- ప్రతిగా భీకర దాడులతో విరుచుకుపడిన ఐడీఎఫ్
జెరూసలెం/బీరుట్: ఇజ్రాయెల్ ఆర్మీ, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపు మధ్య పరస్పరం భీకర దాడులు జరిగాయి. శుక్రవారం ఉదయం దక్షిణ లెబనాన్ నుంచి హెజ్బొల్లా 140 రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) లెబనాన్ రాజధాని బీరుట్ సహా దక్షిణాది ప్రాంతాల్లోని హెజ్బొల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. దక్షిణ బీరుట్‌లోని ఓ స్థావరంపై జరిగిన దాడిలో హెజ్బొల్లాకు చెందిన రద్వాన్ యూనిట్ చీఫ్, టాప్ కమాండర్ ఇబ్రహీం అఖీల్ మృతి చెందాడు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇబ్రహీంతో సహా 12 మంది చనిపోగా, 66 మంది గాయపడ్డారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాల్లో దాదాపు వెయ్యి రాకెట్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి తరహాలోనే ఇజ్రాయెల్‌పైకి మరో దాడి చేసేలా కుట్ర పన్నినందుకే ఇబ్రహీం అఖీల్ సహా ఇతర కమాండర్లు ఉన్న స్థావరాలను పేల్చేశామని వెల్లడించింది. ఇటీవల లెబనాన్ లో హెజ్బొల్లా మిలిటెంట్ల చేతుల్లోని పేజర్లు, వాకీటాకీలు, రేడియోల పేలుళ్ల నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొన్నది.
హెజ్బొల్లా మిలిటెంట్సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్మెరుపు దాడికి దిగింది. గురువారం మధ్యాహ్నం నుంచి చేస్తున్న వైమానిక దాడిలో వంద రాకెట్ లాంచర్లలో ఉన్న వెయ్యి రాకెట్లను ధ్వంసం చేసినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు హెజ్బొల్లా మౌలిక వసతులు, సామర్థ్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ కొనసాగిస్తామని వెల్లడించింది.
లెబనాన్‌పై డజన్ల కొద్దీ బాంబులు
రెండు రోజుల క్రితం లెబనాన్‌లో ఒకేసారి 3000 పేజర్లు పేలాయి. ఈ ఘటనలో 37 మంది చనిపోగా..3 వేల మందికిపైగా గాయపడ్డారు. ఆ మరుసటి రోజే వాకీటాకీలు, రేడియోలు పేలిపోయాయి. ఇది ఇజ్రాయెల్ పనేనని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బొల్లా శపథం చేసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఇజ్రాయెల్.. గురువారం మధ్యాహ్నం నుంచి దక్షిణ లెబనాన్‌పై దాడికి దిగింది. డబజన్ల కొద్దీ బాంబులతో ఇజ్రాయెల్విరుచుకుపడిందని లెబనాన్భద్రతా సిబ్బంది వెల్లడించారు.
గాజాలో 34 మంది మృతి
ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా గాజాపైన దాడులు చేసింది. దీంతో మొత్తం 34 మంది చనిపోయారు. సదరన్ గాజాలోని రఫా సిటీలోనే ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 13 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారని గాజా అధికారులు తెలిపారు.