స్నేహితుడి ఇంట్లో ఐపీఎస్ అధికారి దారుణ హత్య

స్నేహితుడి ఇంట్లో ఐపీఎస్ అధికారి దారుణ హత్య

జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి తన స్నేహితుడి ఇంట్లో ఆయన హత్యకు గురవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హేమంత్ కుమార్ శరీరంపై కాలిన గాయాలు, కొంతుకోసిన అనవాళ్లు కనిపించాయి. తన సొంత ఇంటికి గత ఆరు నెలలుగా మరమ్మతులు జరుగుతుండగా జమ్మూశివారులోని తన స్నేహితుడి ఇంట్లో గత కొద్ది రోజుల నుంచి ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మూడురోజుల పర్యటన జరుగుతుండగా..  జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

జమ్మూకశ్మీర్‌ జైళ్లశాఖ డీజీ హేమంత్ కుమార్ లోహియా(57).. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్. 30 ఏళ్ల సర్వీస్ లో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. తీవ్రవాదం ఎక్కువగా ఉన్న సమయంలో సెంట్రల్ కశ్మీర్ డీఐజీగా ఉన్నారు. ఆగస్టులో జమ్మూ కశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీగా నియమితులయ్యారు లోహియా. 

తన ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ అనే వ్యక్తి హేమంత్ కుమార్ ను దారుణంగా హత్యచేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని డైరీ సహా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అతని ఇంటి ఆవరణలోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రజలకు తెలిసేలా అతని ఫొటోను విడుదల చేశారు. అతని జాడ తెలిస్తే వెంటనే తమకు సమాచారం తెలియజేయాలని సూచించారు. 

హేమంత్ కుమార్ లోహియాను గొంతు కోసేందుకు విరిగిన కిచప్ బాటిల్ ను ఉపయోగించి హత్య చేశాడని  జమ్మూ సీనియర్ పోలీసు అధికారి ముఖేష్ సింగ్ తెలిపారు.అనంతరం హత్యకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు మృతదేహాన్ని నిప్పంటించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. గదిలో నుంచి మంటలు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే గది లోపల మాత్రం తాళం వేసి ఉందని చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే జైళ్లశాఖ డీజీని హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు పారిపోతున్న విజువల్స్ ఇంటిలోని సీసీ పుటేజీలో గుర్తించారు. 

లోహియా ఇంట్లో దాదాపు ఆరు నెలలుగా యాసిర్ అహ్మద్ పనిచేస్తున్నాడు. అతను ఎప్పుడూ దూకుడుగా ఉండేవాడని..తరచూ డిప్రెషన్ గురై బాధపడుతూ ఉంటాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతని మానసిక పరిస్థితిని ప్రతిబింబించే డైరీ, డాక్యుమెంటరీ, కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే ఈ హత్యకు తామే బాధ్యులమంటూ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్(పీఏఎఫ్ఎఫ్‌) అనే ఉగ్ర సంస్థ ప్రకటించుకున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఈ నేరంలో ఉగ్రకోణాన్ని ప్రస్తావించలేదు.