కలెక్టర్..ఐపీఎస్‌ ఫేస్ బుక్ లో పోటోల పంచాది

కలెక్టర్..ఐపీఎస్‌  ఫేస్ బుక్ లో పోటోల పంచాది

కర్ణాటకలో మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఐఏఎస్‌ రోహిణి సింధూరి, ఐపీఎస్‌ రూపా ముద్గల్‌ లు తాము ఉన్నతాధికారులమని మరిచి సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏమైంది.. ఎందుకు వీరిద్దరి మధ్య వైరం మొదలైంది...  అన్న విషయానికొస్తే.. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారడం ఇదేం కొత్త కాదు. మొదట్లో చాలా సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరి తీరు రానూ రానూ వివాదాస్పదమైంది.  అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్ రోహిణిపై చర్యలు తీసుకోవాలని ఐపీఎస్‌ డి. రూపా ముద్గల్ ఫేస్ బుక్ లో డిమాండ్ చేశారు. ఎందుకు ఆమెపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. దాంతో పాటు రోహిణికి చెందిన కొన్ని వ్యక్తిగత ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. ఐఏఎస్‌ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రూప ప్రశ్నించారు. కొవిడ్ టైంలో మైసూర్ కలెక్టర్‌గా ఉన్న రోహిణి... విలాసవంతమైన స్విమ్మింగ్ ఫూల్ నిర్మించుకున్నారని.. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఏకంగా 19 రకాల ఆరోపణలతో కూడిన ఓ జాబితానే రిలీజ్‌ చేసి, రూప అందర్నీ షాక్ కు గురి చేశారు.

ఈ విషయంపై స్పందించిన ఐఏస్‌ రోహిణి సింధూరి మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఇలా ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం చేసి తనపై దుష్పప్రచారం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రూపా ముద్గల్‌ మతి స్థిమితం కోల్పోయిందని కామెంట్ చేశారు. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతోనే ఇలా వ్యవహరిస్తోందని, ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలని రోహిణి సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా వీరిద్దరి పోస్టింగ్ వార్ పై అధికారులు కూడా ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఏమైనా చేస్కోవచ్చు కానీ.. ఇలా బహిరంగంగా చేయడం సహించబోమని, సాధారణ వ్యక్తులు కూడా ఇలాంటి పనులు చేయరన్నారు. కాగా ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కూడా ఈ విషయంపై స్పందించారు. కానీ దీన్ని ఆయన వారి వ్యక్తిగత విషయంగా అభివర్ణించారు. కానీ సీఎం కల్పించుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది విస్తున్నారు. అయితే కర్నాటకలో రూపా ప్రస్తుతం హోంగార్డ్స్‌ ఐజీగా ఉండగా, రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు.