కరోనాకు స్వ‌దేశీ వ్యాక్సిన్!: హైద‌రాబాద్ కంపెనీకి ఐసీఎంఆర్ స‌హ‌కారం

కరోనాకు స్వ‌దేశీ వ్యాక్సిన్!: హైద‌రాబాద్ కంపెనీకి ఐసీఎంఆర్ స‌హ‌కారం

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌న‌కు వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు అనేక దేశాలు ప్ర‌యోగాలు చేస్తున్నాయి. దాదాపు 90 సంస్థ‌లు వ్యాక్సిన్ అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నాయ‌ని గ‌తంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది. పుణేకి చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ యూకేలోని ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీతో క‌లిసి ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. త‌మ రీసెర్చ్ మంచి ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని, ఇప్ప‌టికే మ‌నుషులుపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ స్టార్ట్ చేశామ‌ని చెబుతున్నారు ఆక్స్ ఫ‌ర్డ్ శాస్త్ర‌వేత్త‌లు. సెప్టెంబ‌రు క‌ల్లా వ్యాక్సిన్ సిద్ధ‌మ‌వుతుంద‌ని సీరం కంపెనీ కూడా ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. ఈ వ్యాక్సిన్ ప్ర‌యోగాలు, డెవ‌ల‌ప్మెంట్ అంతా లండ‌న్ లోనే జ‌రుగుతోంది. అయితే మ‌న హైద‌రాబాద్ కు చెందిన కంపెనీ భార‌త్ బ‌యోటెక్ ఇంట‌ర్నేష‌న‌ల్ లిమిటెడ్ కూడా క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌యోగాల్లో మంచి పురోగ‌తి సాధిస్తోంది. సిటీలోని జినోమ్ వ్యాలీలో ప్రయోగాలు చేస్తున్న ఈ కంపెనీకి ఇప్పుడు భార‌త ప్ర‌భుత్వం అండ ల‌భించింది. వ్యాక్సిన రీసెర్చ్ లో భార‌త్ బ‌యోటెక్ తో  భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ICMR) టై అప్ అయింది.  ఇప్ప‌టికే ICMR శాస్త్ర‌వేత్త‌లు ఆ సంస్థ‌కు పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నారు.

స్వ‌దేశీ క‌రోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు భార‌త్ బ‌యోటెక్ తో తాము క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ICMR) ప్ర‌క‌టించింది. ఈ సంస్థ ప్ర‌యోగాల‌కు సంబంధించి వేగంగా అప్రోవ‌ల్స్ వ‌చ్చే పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని తెలిపింది. ICMR ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న పుణేలోని నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ నుంచి ఇప్ప‌టికే వ్యాక్సిన్ త‌యారీ కోసం వైర‌స్ స్ట్రైన్ ను భార‌త్ బ‌యోటెక్ కు అందించిన‌ట్లు వెల్ల‌డించింది. వ్యాక్సిన్ అభివృద్ధి, జంతువుల‌పై ప్ర‌యోగాలు, ఆ త‌ర్వాత మ‌నుషుల‌పై క్లినిక‌ల్ ట్ర‌యల్స వంటి అన్ని ద‌శ‌ల్లో వేగంగా అనుమ‌తులు వ‌చ్చేలా ICMR సాయ‌ప‌డుతుంద‌ని నిన్న ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.