ప్రభుత్వ ఆస్పత్రికి కరంట్ కట్ .... టార్చిలైట్ వెలుగులో చికిత్స చేస్తున్న వైద్యులు

ప్రభుత్వ ఆస్పత్రికి కరంట్ కట్ .... టార్చిలైట్ వెలుగులో చికిత్స చేస్తున్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా అప్రకటిత విద్యుత్ కోతల దెబ్బకు నరకం అనుభవిస్తున్నారు.  ఆస్పత్రుల్లో రోగులతో పాటు వైద్యులు  కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు.  మన్యం జిల్లాలోని ఓ ఆస్పత్రిలో టార్చిలైట్ వెలుగులో చికిత్ప చేస్తున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లా   కురుపాం ప్రభుత్వ వైద్యశాలలలో  విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.. ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయలేదు. అదే సమయంలో డాక్టర్లు చికిత్స చేయాల్సి వచ్చింది. అక్కడి స్టాఫ్ నర్సులు కొవ్వొత్తులు, టార్చి లైట్ల కాంతితో చికిత్స చేస్తున్నారు.  అలాగే ఆస్పత్రి ప్రసూతి విభాగంలో ఉన్న చంటి బిడ్డ తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు కరెంటు లేక దోమలతో ఇబ్బందులుపడ్డారు. 

ముఖ్యంగా రాత్రివేళల్లో గంటల తరబడి కరెంటు తీసేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉక్కపోత.. బయటకు వస్తే దోమల మోతతో జాగారం చేస్తున్నారు. పసిపిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇళ్లలో నరకం కనిపిస్తోంది. పసిబిడ్డలకు తల్లులు రాత్రంతా విసనకర్రతో విసరాల్సిన పరిస్థితులు..