
- సెయింట్ లూయిస్ సిటీలో 5 వేల ఇండ్లు ధ్వంసం
- స్కాట్ కౌంటీ సిటీలోనూ దెబ్బతిన్న అనేక ఇండ్లు
వాషింగ్టన్: అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. కెంటకే, మిస్సోరి రాష్ట్రాలను తఫాను, టోర్నడో ముంచెత్తాయి. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా కెంటకేలోని లారెట్ కౌంటీలో 9 మంది, మిస్సోరిలోని సెయింట్ లూయిస్ సిటీలో ఏడుగురు కలిపి మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం మొదలైన తుఫాన్ కొద్దినిమిషాల్లోనే టోర్నడోగా మారింది.
మొదట లూయిస్ నగరాన్ని ఆపై లారెల్ కౌంటీని సుడిగాలి అతలాకుతలం చేసింది. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడింది. దీంతో లారెట్ కౌంటీ, లూయిస్ నగరాల్లోని చాలాప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఒక్క లూయిస్ సిటోలోనే దాదాపు 5 వేల ఇండ్లు, వాణిజ్య భవనాలు డ్యామేజయ్యాయి. వేగంగా వీస్తున్న గాలికి భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడి కరెంటు స్తంబాలు కూలిపోయాయి.
విద్యుత్ అంతరాయం కారణంగా లక్షకు పైగా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. సెంటినియల్ చర్చ్ కూలిపోయింది. సెయింట్ లూయిస్ జూ ను అధికారులు మూసివేశారు. మెట్రో రైలు సేవలు నిలిపివేశారు. స్కాట్ కౌంటీ సిటీలోనూ అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. తీవ్రమైన సుడిగాలి ధాటికి రోడ్లమీదున్నోళ్లు ఎక్కడికక్కడ మాల్స్, అపార్ట్‌మెంట్లలోని సెల్లార్లలోకి పరుగులుపెట్టారు. మొత్తం 20 నిమిషాల పాటు వీచిన సుడిగాలులు కెంటకే రాష్ట్రాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీశాయని అధికారులు తెలిపారు.
అనేక మంది ఆస్పత్రులకు..
లూయిస్ సిటీకి అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన అనేకమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, బర్స్ అనే ఆస్పత్రికి వచ్చిన 30 మంది పేషెంట్లలో కొందరి కండిషన్ సీరియస్‌గా ఉందని తెలిపారు. గాయాలవడంతో సెయింట్ లూయిస్ చిల్డ్రన్ ఆస్పత్రిలోనూ 15 మంది చిన్నారులు అడ్మిట్ అయ్యారని చెప్పారు.