శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని మరో స్టేట్కు ఉపద్రవం ముంచుకొస్తోంది. కెంటకీ, తదితర రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి భారీ వానలు, టోర్నడోలు విధ్వంసం సృష్టించగా, ఇప్పుడు కాలిఫోర్నియా స్టేట్లోని ఉత్తర ప్రాంతానికి పెను ముప్పు పొంచి ఉంది. సోమ, మంగళవారం మధ్య నార్తర్న్ కాలిఫోర్నియాలో 15 సెంటీమీటర్ల వరకు భారీ వర్షాలు కురుస్తాయని, సియెర్రా నెవడా పర్వత ప్రాంతంలో 10 ఫీట్ల వరకు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోనూ కుండపోత వానలు పడతాయని, బే ఏరియాలో కూడా భారీ ఎత్తున మంచు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. సియెర్రా ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లు జాగ్రత్త పడేందుకు ఇదే ఆఖరి రోజని శనివారం వెదర్ సర్వీస్ అధికారులు ప్రకటించారు. ఇక్కడ కొన్ని రోజుల పాటు వింటర్ స్టార్మ్ కొనసాగుతుందని, దీనిని మరిచిపోవడానికి కొన్నేండ్లు పట్టేటంతగా బీభత్సం సృష్టించొచ్చని చెప్పారు. వారం మధ్యలో మరో తుఫాన్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. సియెర్రా పర్వత ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఈ ప్రాంతంలో ప్రయాణించే వాళ్లు ముందు
జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద విపత్తుల్లో ఇదీ ఒకటి: టోర్నడో బీభత్సంపై బైడెన్
విల్మింగ్టన్: అమెరికాలో సంభవించిన టోర్నడోల బీభత్సం ‘దేశ చరిత్రలోనే అతి పెద్ద విపత్తుల్లో ఒకటి’అని ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఇది చాలా విషాదకరమని, ఈ టోర్నడో వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలియరాలేదని చెప్పారు. త్వరలో టోర్నడో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని బైడెన్ చెప్పారు. బాధితులకు అన్నిరకాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని మీడియాకు వెల్లడించారు. వాతావరణ మార్పులే టోర్నడోలకు కారణమా అన్న ప్రశ్నకు కచ్చితంగా చెప్పలేనని బైడెన్ జవాబిచ్చారు. కొంతవరకు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం కావొచ్చన్నారు.
