
హైదరాబాద్/బషీర్ బాగ్/సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం సుమారు గంటన్నర పాటు దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్, శేరిలింగంపల్లి, ఎర్రగడ్డ, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో భారీ వాన పడింది. రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలవడంతో జనం ఇబ్బందిపడ్డారు. బషీర్‌బాగ్ నుంచి హైదర్‌గూడ వెళ్లే మార్గం చెరువును తలపించింది. అత్తాపూర్ వాసుదేవరెడ్డినగర్ కాలనీలోని 4 అంతస్తుల బిల్డింగ్‌కు సమీపంలో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ బిల్డింగ్‌లోని టీవీలు, ఫ్రిజ్‌లు షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయాయి. నాలుగో అంతస్తు స్వల్పంగా ధ్వంసమైంది. పిడుగు పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షానికి బస్సులు ఆలస్యంగా నడవడంతో ప్యాసింజర్లు మెట్రో పిల్లర్లు, ఫ్లై ఓవర్లు కింద గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. బల్దియా కంట్రోల్ రూమ్ కు 2 గంటల్లోనే వందకుపైగా ఫిర్యాదులు అందాయి. వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని బల్దియా అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. సోమవారం నీటిమట్టం 513.30 మీటర్లకు చేరింది. హుస్సేన్ సాగర్ చేరుతున్న నీటిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు బయటకు పంపుతున్నారు.