అస్సాంను ముంచెత్తిన వరదలు

అస్సాంను ముంచెత్తిన వరదలు
  • 33,500 మందిపై తీవ్ర ప్రభావం
  • రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  • ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర

గువాహటి: అస్సాంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన వాన.. గ్యాప్​ లేకుండా పడుతూనే ఉంది. పలు పట్టణాలు, గ్రామాలు, పొలాలు ముంపునకు గురయ్యాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గువాహటిలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు (7 నుంచి 11 సెంటీ మీటర్లు), అతిభారీ (11 నుంచి 20 సెం.మీ), అత్యంత భారీ వర్షపాతం (20 సెం.మీ కంటే ఎక్కువ) నమోదవుతుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) తెలిపింది. లోయర్ అస్సాంలోని కోక్రాఝర్, చిరాంగ్, బక్సా, బార్పేట, బొంగైగావ్ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వివరించింది. ధుబ్రి, కమ్రూప్, కమ్రూప్ మెట్రోపాలిటన్, నల్బారి, డిమా హసావో, కాచర్, గోల్‌‌‌‌పరా, కరీంగంజ్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆర్ఎంసీ.. మంగళవారం కోసం ఆరెంజ్ అలర్ట్, తర్వాతి రెండు రోజుల కోసం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

నీట మునిగిన 142కు పైగా గ్రామాలు

అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్​మెంట్ అథారిటీ (ఏఎస్​డీఎంఏ) డెయిలీ ఫ్లూడ్ రిపోర్ట్ ప్రకారం.. కాచర్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూఘర్, గోలాఘాట్, హోజాయ్, లఖింపూర్, నాగావ్, నల్బరీ, సోనిత్‌‌‌‌పూర్, టిన్సుకియా, ఉదల్‌‌‌‌గురి జిల్లాల్లో వరదల కారణంగా 33,400 మంది ఇబ్బందిపడుతున్నారు. లఖింపూర్‌‌‌‌లో 25,200 మంది, దిబ్రూఘర్​లో 3,800 మంది, టిన్సుకియాలో 2,700 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. మూడు జిల్లాల్లో 16 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.