ఢిల్లీలో దంచికొట్టిన కుండపోత వర్షాలు.. నలుగురు మృతి.. 122 విమానాలు ఆలస్యం..

ఢిల్లీలో దంచికొట్టిన కుండపోత వర్షాలు.. నలుగురు మృతి.. 122 విమానాలు ఆలస్యం..

ఢిల్లీలో వానలు దంచికొడుతున్నాయి. ఒకవైపు గాలి వాన బీభత్సం సృష్టిస్తుంటే.. మరో వైపు తీవ్రమైన దుమ్ము ఢిల్లీని కమ్మేసింది. శుక్రవారం (మే 2) తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో రాజధాని నగరం అతలాకుతలం అయ్యింది. చెట్లు కూలడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. 

భారీ వర్షాలకు ఢిల్లీలో గోడ కూలి నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నజఫ్ గర్ ప్రాంతంలో చెట్టు కూలి ఇంటి మీద పడటంతో వర్షానికి నానిన గోడలు కూలిపోయాయి. ద్వారక లోని ఖల్ఖారి గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ జ్యోతి (26)తో పాటు ముగ్గురు చిన్నారులు చనిపోయారు. శిథిలాల నుంచి బయటికి తీసి ఆర్టీఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జ్యోతి భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

భారీ వర్షాలతో ఢిల్లీలో జనజీవనం స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థ ఆగిపోయింది. భారీ వర్షాల కారణంగా 122 విమానాలు ఆసస్యంగా నడవనున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ప్యాసెంజర్స్ కు ఎయిర్ పోర్ట్ లో తగిన సౌకర్యాలు కల్పిస్తామని ఎక్స్ లో పేర్కొంది. అంతే కాకుండా వర్షాల కారణంగా 40 విమానాలను దారి మళ్లించినట్లు ప్రకటించారు. దారుణ పరిస్థితులు ఉన్న దృష్ట్యా కొన్ని ఫ్లైట్స్ షెడ్యూల్ మార్చుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 

ఢిల్లీలో 40 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తీవ్రత మరింత పెరగడానికి అవకాశం ఉండటం వలన ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. యమునానగర్, పానిపట్, నుహ్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.