పన్నులు వసూళ్ల​యితలే..! సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో మొత్తం రూ.51.30 కోట్ల బకాయిలు

పన్నులు వసూళ్ల​యితలే..! సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో మొత్తం రూ.51.30 కోట్ల బకాయిలు
  •     2 నెలలుగా నీటి సరఫరా సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి
  •     అధికారులపై కలెక్టర్​ సీరియస్​
  •     నెల రోజుల్లో వసూలు చేయకుంటే యాక్షన్

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో మున్సిపాలిటీలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ లు, నల్లా బిల్లులు వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బకాయిలు పేరుకుపోయాయి. 8 మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం రూ.51.30 కోట్ల బిల్లులు వసూలు కాకపోవడంతో మున్సిపాలిటీల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి.

జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి బుధవారం మున్సిపల్ కమిషనర్ల తోపాటు ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ ఉద్యోగులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి బకాయిలపై సీరియస్ అయ్యారు. బల్లియాల్లో రెండు నెలల్లోగా ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్లు బిల్ కలెక్టర్లకు రోజువారీగా టార్గెట్లు పెట్టి పన్నుల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. అయితే జిల్లాలో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిన సంగారెడ్డిలోనే రూ.17.40 కోట్ల బాకీలు పేరుకుపోవడంతో ఇక్కడ వారం రోజుల క్రితం స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టారు. అమీన్ పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ లు కొంత ఉన్నప్పటికీ నల్ల బిల్లుల చెల్లింపులు డిసెంబర్ నాటికి  పూర్తిగా చేశారు.

వసూలైంది రూ.42.12 కోట్లు మాత్రమే..

జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ, నల్ల బిల్లులు రూ.93.43 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా అందులో రూ.42.12 కోట్లు రాబట్టగలిగారు. ఇంకా రూ.51.30 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. అందులో ప్రాపర్టీ ట్యాక్స్ లు రూ.33.02 కోట్లు, నల్ల బిల్లులు రూ.18.28 కోట్లు ఉన్నాయి. మునిసిపాలిటీల వారీగా చూస్తే సంగారెడ్డిలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.8 కోట్లు, నల్ల బిల్లులు రూ.9.4 కోట్లు, సదాశివపేటలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.4.02 కోట్లు, నల్ల బిల్లులు రూ.3.14 కోట్లు, జహీరాబాద్ మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.2.24 కోట్లు, నల్లా బిల్లులు రూ.4.43 కోట్లు, అమీన్పూర్ లో ఆస్తి పన్నులు రూ.1.20 కోట్లు, నల్ల బిల్లులు నిల్, తెల్లాపూర్ మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.8.56 కోట్లు, నల్లా బిల్లులు నిల్, బొల్లారంలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.7.53 కోట్లు, నల్లా బిల్లులు రూ.1.42 కోట్లు, నారాయణఖేడ్ లో ఆస్తి పనులు రూ.1.9 కోట్లు, నల్లా బిల్లులు రూ.10.58 లక్షలు, ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు రూ.37.21 లక్షలు, నల్లా బిల్లులు రూ. 15 లక్షలు వసూలు కావాల్సి ఉంది. 

సంగారెడ్డిలో..

సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం రూ.17.40 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కమిషనర్ సుజాత నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ షురువైంది. ఈ మున్సిపాలిటీలో నాలుగైదు సంవత్సరాలుగా ఆస్తి పన్నులు, నల్ల బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. పన్నులు చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలలో ఐదు శాతం రిబేట్ ఇస్తోంది. అయినప్పటికీ  సంగారెడ్డి మున్సిపాలిటీలో బిల్లులు వసూలు కావడంలేదు.

ఇక్కడ మొత్తం 12 వేల నల్ల కనెక్షన్లు ఉండగా ఒక్కో ఇంటి యజమాని రూ.150 చొప్పున నెలకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బిల్లుల వసూళ్లపై పాలకవర్గం పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో సమస్య తీవ్రమైంది. తాజాగా ఇక్కడ 10 మంది బిల్ కలెక్టర్లు రోజువారీగా రూ.30 వేల బిల్లులు వసూలు చేయాలన్న టార్గెట్ విధించారు. మొత్తం 38 వార్డులు ఉండగా ఒక్కొక్కరికి రెండు లేదా మూడు వార్డులు అదనంగా ఇచ్చి వసూళ్లు చేయిస్తున్నారు.

జీతాలకు లోటు.. 

మున్సిపల్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గిపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో నెలవారీ జీతాలు చెల్లించలేని పరిస్థితిలో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్,  బొల్లారం, నారాయణఖేడ్ మున్సిపాలిటీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుతం ఆయా బల్దియాల్లో ఆస్తి పన్నులు, నల్లా బిల్లుల వసూళ్లకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తేనే జనవరి నెల వేతనాలు ఇస్తామన్న కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీలో నీటి విభాగంలో పనిచేసే 102 మంది సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇస్తలేరు. బాకాయిలు వసూలు అయితేనే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందని, సంక్రాంతి సందర్భంగా కూడా తమకు వేతనాలు ఇవ్వలేదని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. 

మార్చిలోగా వసూలు చేస్తాం 

ప్రాపర్టీ ట్యాక్స్ లు, నల్ల బిల్లులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమే. బిల్లుల వసూళ్ల కోసం వారం రోజులుగా సంగారెడ్డిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. 102 మంది వాటర్ వర్క్స్ సిబ్బందికే కాదు మున్సిపాలిటీలో పనిచేసే ఎవ్వరికీ ఈ నెలలో జీతాలు ఇవ్వలేదు. సంగారెడ్డి పెండింగ్ బిల్లులపై కలెక్టర్ కు నివేదించి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ మార్చిలోగా  బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చాం. బిల్లులు వసూలు చేస్తేనే వేతనాలు ఇస్తామన్న కండిషన్ పెట్టాం. బకాయిల వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినందున త్వరలో పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నాం. 
సుజాత, కమిషనర్, (సంగారెడ్డి మున్సిపాలిటీ)