టీఆర్‌ఎస్‌లో మొదలైన ఎమ్మెల్సీ సీట్ల హడావుడి

టీఆర్‌ఎస్‌లో మొదలైన ఎమ్మెల్సీ సీట్ల హడావుడి
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు టీఆర్‌ఎస్‌లో గట్టి పోటీ
  • పలువురు నేతలకు పదవి ఇస్తానని కేసీఆర్‌ హామీ
  • ఇద్దరు లేదా ముగ్గురికి రెన్యూవల్.. మరో మూడు సీట్లు కొత్త వారికి

హైదరాబాద్‌, వెలుగు: ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో టీఆర్‌ఎస్‌లో హడావుడి మొదలైంది. పదవీకాలం ముగిసిన వాళ్లు రెన్యూవల్‌ కోసం.. ఇప్పటిదాకా అవకాశం దక్కని వారు, పలు సందర్భాల్లో పార్టీ అధినేత నుంచి హామీ పొందిన వాళ్లు ఒక్క చాన్స్‌ అని ఎదురు చూస్తున్నారు. ఆరు సీట్లకు 60 మందికి పైగానే నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌ను, మరికొందరు మంత్రి కేటీఆర్‌ను కలిసి.. తమకు చాన్స్‌ ఇప్పించాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగిసిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, మాజీ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో ఇద్దరు నుంచి ముగ్గురికి రెన్యూవల్‌ ఉంటుందని కేసీఆర్‌, కేటీఆర్‌ నుంచి హామీ దక్కినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రెన్యూవల్‌ చేసే సీట్లు పోగా మిగిలిన మూడు స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
జిల్లాల వారీగా ఆశావహులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జిల్లా నుంచి మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు తమకు ఏదో ఒక పదవి ఇప్పించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సాగర్‌ ఉప ఎన్నిక టైంలో హామీ పొందిన ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పార్టీ నాయకులు శశిధర్‌ రెడ్డి, కర్నాటి విద్యాసాగర్‌, చాడ కిషన్‌ రెడ్డి తదితరులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి కడియం శ్రీహరి, మధుసూదనాచారి, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు, నూకల నరేశ్‌ రెడ్డి అవకాశం ఎదురు చూస్తున్నారు.
నిజామాబాద్‌ నుంచి ఆకుల లలిత, మండవ వెంకటేశ్వర్‌రావు, అరికెల నర్సిరెడ్డి, రాజారాం యాదవ్‌ పోటీ పడుతున్నారు. మెదక్‌ జిల్లా నుంచి ఫరీదుద్దీన్‌, దేశపతి శ్రీనివాస్‌, గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంబీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ సలీం, బండి రమేశ్‌, పీఎల్‌ శ్రీనివాస్‌తో పాలు పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్‌ నుంచి మాజీ ఎంపీ గోడం నగేశ్‌, అరిగెల నాగేశ్వర్‌రావు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, షాట్స్‌ మాజీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, శివకుమార్‌, జనార్దన్‌ తదితరులు చాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు.
కరీంనగర్‌ నుంచి టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌ కుమార్‌, పార్టీ జనరల్‌ సెక్రటరీ రావుల శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎల్పీ సెక్రటరీ మాదాడి రమేశ్‌ రెడ్డి, పిట్టల రవీందర్‌ తదితరులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి క్యామ మల్లేశ్‌, మర్రి రాజశేఖర్‌ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్‌ రెడ్డి, పోరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు అవకాశం ప్రయత్నిస్తున్నారు.

కులం లెక్కలు పక్కాగా..
బీసీల నుంచి చట్టసభల్లో స్థానం దక్కని కులాల వారికి అవకాశం ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. చేనేత, కుమ్మరులకు కచ్చితంగా చోటు కల్పిస్తామని తెలిపారు. మరోవైపు విశ్వబ్రాహ్మణులు, మున్నూరు కాపులు చాన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఆరు సీట్లలో రెండు సీట్లు రెడ్డి కులానికి, రెండు బీసీలకు, ఒకటి ఎస్సీలకు ఇచ్చే అవకాశాలున్నాయి. ఖాళీ అయ్యే స్థానాల్లో మైనార్టీ కూడా ఉండటంతో ఆ వర్గం నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన స్థానం నుంచి హుజూరాబాద్‌కు చెందిన కౌశిక్‌ రెడ్డి పేరు నామినేట్‌ చేశారు. సోషల్‌ సర్వీస్‌ కేటగిరీలో కౌశిక్‌ పేరు నామినేట్‌ చేయడంతో గవర్నర్‌ ఆ ప్రపోజల్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఆయన స్థానంలో మరొకరి పేరు రికమండ్‌ చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే కోటాలో కౌశిక్‌ పేరు పరిశీలించే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే జరిగితే ఎమ్మెల్యే కోటాలోని ఆరు, గవర్నర్‌ కోటాలో ఒక స్థానం కలుపుకుంటే మొత్తం ఏడు సీట్లలో రెండు రెడ్డి కులానికి, మూడు బీసీలకు, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్క సీటు ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.