
- నష్టాల సాకుతో హరిత హోటళ్లను లీజుకిస్తున్న టూరిజం కార్పొరేషన్
- కొద్దిరోజుల్లోనే లాభాల్లోకి..
- అధికారుల తీరుపై సందేహాలు
- ఉన్న 55 హోటళ్లలో ఇప్పటికే 21 లీజుకు..
- మరో పదింటిని కూడా అప్పగించే యోచన
హైదరాబాద్, వెలుగు: అది ములుగు జిల్లా జంగాలపల్లి హరిత హోటల్. మొన్నటిదాకా టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులే నడిపేటోళ్లు. అప్పుడు రూ. 3 వేలకు మించి బిజినెస్కాలేదు. కానీ.. ఆ హోటల్‌ను ప్రైవేటుకు ఇవ్వగానే రోజుకు రూ. 50 వేల టర్నోవర్‌కు చేరింది! అప్పటి వరకు నష్టాల్లో నడిచిన హోటళ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లగానే లాభాల బాట పట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, నిజంగా హరిత హోటళ్లకు లాభాలు రావడం లేదా? లేదంటే ఉద్దేశపూర్వకంగానే నష్టాల్లోకి నెట్టేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. టూరిజం డిపార్ట్మెంట్హరిత హోటళ్లకు ఓ బ్రాండ్ ఇమేజీ ఉన్నప్పటికీ, వాటి నిర్వహణలో అధికారులు చతికిలపడుతున్నారని, అందుకే నష్టాల సాకుతో హరిత హోటళ్లను ఒక్కొక్కటిగా ప్రైవేట్‌వ్యక్తులకు అప్పగిస్తున్నారని చెబుతున్నారు.
పర్యాటకులు పెరిగినా.. నష్టాలే
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించింది లేదు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ స్కీమ్‌లో భాగంగా తెలంగాణ ట్రైబల్ సర్క్యూట్(ములుగు జిల్లా – రూ. 83 కోట్లు), తెలంగాణ ఎకో టూరిజం సర్క్యూట్ (మహబూబ్‌నగర్ – రూ.91 కోట్లు), తెలంగాణ హెరిటేజ్ సర్క్యూట్ (హైదరాబాద్ – రూ.99 కోట్లు) ప్రాజెక్టులు మంజూరు చేయడంతో ఆయా జిల్లాల్లోని ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి. హోటల్ బిజినెస్ అయితే మరింతగా పెరిగింది. మారిన ఈ పరిస్థితుల నేపథ్యంలో హరిత హోటళ్లు లాభాల బాటలో నడవాల్సి ఉండగా, నష్టాల్లోకి కూరుకుపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
పర్యవేక్షణ లోపంతోనే నష్టాలు
హోటళ్లపై అధికారుల పర్యవేక్షణ లోపమూ నష్టాలకు కారణంగా తెలుస్తోంది. పైరవీలతో సిబ్బందిని నియమించుకోవడంతో వారు హోటళ్లను నిర్వహించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టూరిస్టులతో, ఇతర కస్టమర్లతో సిబ్బంది వ్యవహరించే తీరు, భోజనంలో నాణ్యత పాటించకపోవడమూ గిరాకీ తగ్గడానికి కారణమని విమర్శలున్నాయి.
హైదరాబాద్‌లో ఏడు లీజుకు
రాష్ట్రంలో 55 హరిత హోటళ్లు ఉండగా, 21 హోటళ్లను పదేళ్ల లీజుకు ఇచ్చారు. మరో పది హోటళ్లను కూడా ఇదే పద్ధతిలో అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్, గండిపేటలోని హరిత రిసార్ట్ ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మాణం, నిర్వహణ, బదలాయింపు (బీఓటీ) పద్ధతిలో 33 ఏళ్ల దీర్ఘకాల లీజులో నడుస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన హోటళ్లు ఇవి. వీటితోపాటు హైదరాబాద్ జిల్లాలో ఏడు, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో రెండు హోటళ్ల చొప్పున ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారు. అలాగే లక్నవరం సరస్సు, బొగత జలపాతం, మేడారం సమ్మక్క, సారలమ్మ, మల్లూరు టెంపుల్, తాడ్వాయి అడవులతో రాష్ట్రంలో టూరిస్ట్ స్పాట్‌గా పేరొందిన ములుగు జిల్లాలోని జంగాలపల్లిలో హరిత హోటల్‌ను ఇదే పద్ధతిలో ఇటీవల లీజుకిచ్చారు. ఈ హరిత హోటల్‌ను గతేడాది టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులే నడపగా రోజుకు రూ.3 వేలకు మించి బిజినెస్ కాలేదు. ఏడాదికి రూ.లక్ష లీజుకు లీజుకిచ్చాక ఊహించని రీతిలో రోజుకు రూ.50 వేల వరకు టర్నోవర్ అవుతున్నట్లు సమాచారం.