పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యంపై ఫోకస్

పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యంపై ఫోకస్
  • తొలుత 20 డెస్టినేషన్​ ప్లేస్​లలో క్లీనింగ్​
  • అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపట్టేలా ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యంతోపాటు వాష్​రూమ్స్, టాయిలెట్స్​​ అందుబాటులోకి తీసుకొచ్చేలా టూరిజం శాఖ  ప్రణాళిక రూపొందించింది. తొలుత 20 డెస్టినేషన్​ ప్లేస్​లలో  స్వచ్ఛత  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయా పర్యాటక ప్రాంతాలను బట్టి ఎండో మెంట్, ఫారెస్ట్, హెరిటేజ్, టూరిజం తదితర శాఖల అధికారులు సమన్వయంతో క్లీనింగ్​కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు.

 ముఖ్యంగా మహిళలకు అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్​ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ కొన్ని పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్స్​ లేవు. కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్స్​ ఉన్నా..  నిర్వహణ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. నీటి సౌకర్యం లేక  నిరుపయోగంగా మారుతున్నాయి. 

ఇటువంటి చోట పరిస్థితులను మార్చాలని టూరిజం శాఖ భావిస్తున్నది.  రాష్ట్రాన్ని పర్యాటకానికి కేంద్ర బిందువుగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించినట్లు టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో క్లీనింగ్​పై ఫోకస్​ పెట్టామని, ఆయా ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.