
- భారీ వర్షం పడడంతో పైకప్పు కారి వ్యూ గ్యాలరీలోకి నీళ్లు
- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన టూరిస్టు
- ఏం కారట్లేదన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సీఈవో
- వ్యూ గ్యాలరీలో నీళ్లు నిలిస్తే కారినట్టేనా అని ఎదురు ప్రశ్న
182 మీటర్ల ఎత్తు.. రూ. 2,989 కోట్ల ఖర్చు.. 42 నెలలు.. 24 గంటలు.. 3,400 మంది కూలీలు, 250 మంది ఇంజనీర్లు.. ఇదీ ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా విగ్రహం) నిర్మాణం ఎత్తు, దానికైన ఖర్చు, దానికి పట్టిన రోజులు.. పనిచేసిన సిబ్బంది! ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ ప్రాజెక్టులో భాగంగా అంతెత్తులో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని నర్మదా నది మధ్యలో నిలబెట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో అంగరంగ వైభవంగా దానిని ఓపెన్ చేశారు. మరి, ఓపెన్ చేసినప్పుడున్నంత వైభవం ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఉందా? అంటే వర్షం పడుతున్నప్పుడు అక్కడకు పోతే తెలుస్తుంది.
ఎందుకంటే.. ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కురుస్తోంది. పెద్ద వర్షానికి పైకప్పు లీక్ కావడంతో ఆ విగ్రహం గ్యాలరీ మొత్తం నీటితో నిండిపోయింది. సందర్శకులు ఆ లీకవుతున్న వర్షపు నీళ్లలోనే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాణంలోని లోపాలను బయటపెట్టింది. నర్మదా నది అందాలను చూసేలా 200 మంది టూరిస్టులకు సరిపోయేంతగా ఈ వ్యూ గ్యాలరీని కట్టారు. అక్టోబర్‌లో దానిని ప్రారంభించిన నాటి నుంచి వర్షమే లేదు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం, వర్షాలు పడుతుండడంతో ఈ లోపం బయటపడింది. ఎవరో టూరిస్టు దానిని వీడియో తీయడం, శనివారం సోషల్ మీడియాలో పెట్టేయడంతో ఒక్కరోజులోనే వైరల్ అయిపోయింది. లీకవుతున్నట్టు అంత స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం అదేం లేదంటున్నారు. వ్యూ గ్యాలరీలో నీళ్లు నిలిచినంత మాత్రాన పైకప్పు లీక్ అవుతోందని ఎలా అంటారంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. గ్యాలరీ ఓపెన్‌గా ఉండడం వల్లే వర్షం నీరు వచ్చిందని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సీఈవో ఐకే పటేల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
‘‘నదీ అందాలు సహజసిద్ధంగా కనిపించాలన్న ఉద్దేశంతో గ్యాలరీ ముందు భాగాన్ని ఓపెన్‌గా ఉంచాం. వెనకవైపు గ్లాస్ కవర్ ఉంటుంది. కాబట్టి అక్కడ నీళ్లు పడలేదు. కేవలం ఓపెన్‌గా ఉన్న ప్రాంతంలోనే నీళ్లు వచ్చాయి. పైకప్పు లీక్ అవ్వట్లేదు. అక్కడి నుంచి పడుతున్న వర్షపు నీళ్లూ.. ఇలా బయటి నుంచి లోపలికి వర్షం కొట్టడం వల్ల పడినవే” అని చెప్పారు. అయితే, విగ్రహం బేస్‌లో ఉన్న ఎగ్జిబిషన్ హాల్లో మాత్రం లీకేజీ ఉందని ఆయన అంగీకరించారు. విగ్రహాన్ని నిర్మించిన ఎల్ అండ్ టీకి ఇప్పటికే దీనిపై సమాచారమిచ్చామని, వెంటనే సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని చెప్పారు. విగ్రహం ముందు భాగంలోని పానెళ్లకు కొంచెం గ్యాప్ ఉంటుందని, వాటిని సీల్ చేయలేమని అన్నారు.