పంజాగుట్ట, వెలుగు: ఏటీఎంలో పెట్టాల్సిన నగదును తప్పుదారి పట్టించి, కోటి రూపాయలకు పైగా సొమ్ముతో ఇద్దరు ఉద్యోగులు ఎస్కేప్ అయ్యారు. నగరవ్యాప్తంగా వివిధ ఏటీఎంలలో నింపాల్సిన సుమారు రూ.1.20 కోట్లకు పైగా నగదు వీరు గల్లంతైనట్లు తెలుస్తున్నది. సికింద్రాబాద్‌లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి నగదును తీసుకుని ఏటీఎంలలో నింపుతోంది. ఈ సంస్థలో వాసిరెడ్డి శ్రీరామ్, లతీఫ్ సలీమ్ అనే ఇద్దరు వ్యక్తులు కస్టోడియన్లుగా పనిచేస్తున్నారు. వీరికి సంస్థ 31 ఏటీఎం కేంద్రాలలో నగదును నింపాల్సిన బాధ్యతను అప్పగించింది.
అయితే, వీరు వివిధ బ్యాంకుల నుంచి నగదు తీసుకుని అమీర్‌పేట్, బల్కంపేట్, ఎస్ఆర్ నగర్, యూసఫ్‌గూడ తదితర ప్రాంతాల్లోని సుమారు ఏడు ఏటీఎంలలో భర్తీ చేయకుండా ఆ సొమ్ముతో ఎస్కేప్ అయ్యారు. సంస్థ మేనేజర్ నవీన్ వారికి ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఏటీఎంలను తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది.
ఏటీఎంలో పెట్టాల్సిన నోట్ల కట్టలను పక్కదారి పట్టించి వాళ్లు పరారైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
