
- టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్..రూ.14 లక్షలు
- కమిషన్ సెక్రటరీ పీఏ ప్రవీణే కీలక సూత్రధారి
- ప్రభుత్వ ఉద్యోగి రేణుక కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ ప్రింట్ తీసిచ్చిండు
- బయట అమ్మి.. ప్రవీణ్‌కు రూ.10 లక్షలు ఇచ్చిన రేణుక
హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ లీక్ గుట్టు బయటపడింది. కమిషన్ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచి డేటా చోరీ చేసింది ఇంటి దొంగలేనని తేలిపోయింది. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌తోపాటు టీఎస్‌టీఎస్ ఉద్యోగి రాజశేఖర్ కీలక నిందితులని పోలీసుల విచారణలో వెల్లడైంది. క్వశ్చన్ పేపర్‌ను రూ.14 లక్షలకు అమ్మేయగా.. అందులో వీరిద్దరి వాటాగా రూ.పది లక్షలు ముట్టినట్టు తెలిసింది. క్వశ్చన్ పేపర్‌ను బహిరంగంగానే కొందరు అమ్ముతుండంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. క్వశ్చన్ పేపర్ ఎలా బయటకు తీశారనే దానిపై ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం 13మందిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నారు. ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణతో పరీక్షను టీఎస్‌పీఎస్సీ అధికారులు వాయిదా వేశారు. 15, 16 తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్‌ను కూడా వాయిదా వేశారు.
తమ్ముడి కోసం క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని..
టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌కు ప్రభుత్వ ఉద్యోగి రేణుకతో పరిచయం ఉంది. ప్రవీణ్‌ను కలిసేందుకు ఆమె రెగ్యులర్‌గా టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కి వస్తూ ఉండేది. ఆఫీస్ విషయాలు ప్రవీణ్‌ను అడిగి తెలుసుకునేది. ఈ క్రమంలోనే పేపర్ సీక్రసీపై లోటుపాట్లు గుర్తించింది. టౌన్ ప్లాయింగ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ చేసి, సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేసింది. గత నెల 28న ప్రవీణ్‌ను కలిసింది. తన తమ్ముడు ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీస్’ ఎగ్జామ్ రాస్తున్నాడని, ఎలాగైనా పేపర్ అందించాలని కోరింది. విషయం ముగ్గురి మధ్యే ఉంటుందని, బయటికి చెప్పబోమని ప్రవీణ్‌ను నమ్మించింది. దీంతో అడ్మిన్ రాజశేఖర్‌తో పేపర్ లీకేజ్ గురించి ప్రవీణ్ చెప్పాడు. ఇలా ఇద్దరు కలిసి సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ సిస్టమ్‌లోని పేపర్‌ను దొంగించాలని ప్లాన్ చేశారు. రోజూ శంకరమ్మను గమనించారు. ఆఫీస్‌కి వచ్చి లాగిన్ అయ్యే సమయం, తిరిగి ఇంటికి వెళ్లే సమయాల్లో ఆమె సిస్టమ్ పాస్‌వర్డ్‌ను గుర్తించినట్టు తెలిసింది. శంకరమ్మ వెళ్లిపోయిన తర్వాత ఆఫీస్‌లో ఎవరూ లేని సమయంలో కంప్యూటర్‌లోని క్వశ్చన్ పేపర్‌ను రాజశేఖర్, ప్రవీణ్ కలిసి పెన్‌డ్రైవ్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత ప్రవీణ్ సిస్టమ్ నుంచి ప్రింట్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ పేపర్‌ను రేణుకకు ప్రవీణ్ అందించాడు. అయితే టీఎస్‌పీఎస్సీ ఆఫీసులో సిస్టమ్ ఓపెన్ చేయలేదని, బయటే లాగిన్ పాస్ వర్డ్‌తో ఓపెన్ చేశారని కమిషన్ అధికారులు చెప్తున్నారు. కమిషన్ అధికారుల ఫిర్యాదుతో టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌తో పాటు టీఎస్‌టీఎస్ ఉద్యోగి రాజశేఖర్ ను శనివారం బేగంబజార్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కమిషన్ సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ సిస్టమ్ ను నుంచి డేటా చోరీ అయినట్టు గుర్తించారు.
రీ సేల్‌కి పెట్టడంతో బయటికి..
ప్రవీణ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్‌ను రేణుక తన తమ్ముడికి ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఆ ఎగ్జామ్ ఎవరెవరు రాస్తున్నారనేది తెలుసుకుంది. తన ఊరి సర్పంచ్ కొడుకు రాస్తున్నాడని తెలుసుకుని, అతని ద్వారా ముగ్గురికి పేపర్ బేరం పెట్టినట్టు సమాచారం. మొత్తం రూ.14 లక్షలకు అమ్మగా.. అందులో 10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చింది. దీంట్లో ప్రవీణ్, రాజశేఖర్ వాటాలు పంచుకున్నట్టు తెలిసింది. తర్వాత ఈనెల 2న మరోసారి రేణుక ప్రవీణ్ ను కలిసి.. తనకిచ్చిన పేపర్‌ను ఇచ్చేసింది. అయితే దాన్ని ప్రవీణ్ కాల్చేసినట్టు సమాచారం. రేణుక దగ్గర క్వశ్చ పేపర్ కొన్న సర్పంచ్ కొడుకు, ఇంకో ఇద్దరు కలిసి.. పేపర్‌ను మరికొంత మందికి అమ్మేందుకు ప్లాన్ చేశారు. రూ.లక్ష ఇస్తే పేపర్ జిరాక్స్ కాపీ ఇస్తామని కొందరికి సమాచారం ఇచ్చారు. దీంతో విషయం బయటపడింది. గ్రామానికి చెందిన అభ్యర్థులు.. టీఎస్‌పీఎస్సీ ఆఫీసుతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం కేసు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఒక్క పేపరేనా.. మిగిలిన పేపర్లూ ఇలాగే బయటికొచ్చాయా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.