టయోటా అర్బన్‌‌ క్రూజర్ టైజర్ వచ్చేసింది

టయోటా అర్బన్‌‌ క్రూజర్ టైజర్ వచ్చేసింది
  •     ధర రూ. 7.73 లక్షల నుంచి స్టార్ట్‌‌

న్యూఢిల్లీ :  టయోట కిర్లోస్కర్  బుధవారం ఎంట్రీ లెవెల్ ఎస్‌‌యూవీ అర్బన్‌‌ క్రూజర్ టైజర్‌‌‌‌ను లాంచ్ చేసింది.  ధర రూ. 7.73 లక్షలు (ఎక్స్‌‌షోరూమ్‌‌) నుంచి మొదలవుతోంది.  మారుతి సుజుకీ  తెచ్చిన ఫ్రాంక్స్‌‌ మోడల్‌‌లకు ఈ బండి పోలి ఉంది.  ఇండియాలో మరిన్ని ప్రీమియం మోడల్స్‌‌ను లాంచ్ చేయడానికి టయోట కిర్లోస్కర్  రెడీగా ఉంది. పెద్ద కార్లకు డిమాండ్ పెరుగుతుండడంతో ఈ  సెగ్మెంట్‌‌పై ఫోకస్ పెట్టామని  ప్రకటించింది. హైబ్రిడ్‌‌, బ్యాటరీ ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌ను కూడా తీసుకొస్తామని కంపెనీ ఎండీ టడషి సజుమా  అన్నారు.

కస్టమర్లు చిన్న కార్ల కంటే పెద్ద కార్లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ప్లాంట్‌‌తో కెపాసిటీ పెంచుతున్నామని,  కొత్త మోడల్స్‌‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.  ‘బిడాడి (బెంగళూరు) దగ్గర కొత్త ప్లాంట్‌‌ను ఏర్పాటు చేస్తున్నాం.  కస్టమర్ల డిమాండ్‌‌ను చేరుకోవడానికి ప్రొడక్షన్ పెంచుతున్నాం. కొత్త ప్లాంట్‌‌లో ప్రొడక్షన్ 2026 లో ప్రారంభమవుతుంది’ అని సజుమా అన్నారు. ఎస్‌‌యూవీల అమ్మకాలు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.

2023–24 లో జరిగిన వెహికల్‌‌ హోల్‌‌సేల్ అమ్మకాల్లో 50 శాతం వాటా ఎస్‌‌యూవీలదే ఉందని అన్నారు. ఎంట్రీ లెవెల్‌‌ కార్లు, సెడాన్‌‌లకు డిమాండ్ తగ్గిపోతోందని పేర్కొన్నారు. ఇండియన్ మార్కెట్‌‌లో హైబ్రిడ్ వెహికల్స్‌‌ విస్తరించడానికి మంచి అవకాశం ఉందన్నారు.  కస్టమర్ల అవసరాలను బట్టి ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకొస్తామన్నారు.