- తగ్గిన టయోటా, టాటా మోటార్స్ అమ్మకాలు
- చిన్న కార్లకు తగ్గిన డిమాండ్
- పెరిగిన మారుతి, హ్యుందాయ్, కియా సేల్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: కార్ల అమ్మకాలు కిందటి నెలలో పర్వాలేదనిపించాయి. మారుతి, హ్యుందాయ్, కియా మోటార్ సేల్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో పెరగగా, టాటా మోటార్స్, టయోటా అమ్మకాలు మాత్రం పడ్డాయి. మారుతి సుజుకీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 7 శాతం వృద్ధి చెందాయి. కంపెనీ కిందటేడాది ఏప్రిల్‌లో 1,50,661 బండ్లను డీలర్లకు డిస్పాచ్ చేయగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,60,529 బండ్లను డిస్‌పాచ్ చేసింది. డొమెస్టిక్ మార్కెట్‌లో మారుతి హోల్‌సేల్స్ ఏడాది ప్రాతిపదికన 9 శాతం పెరిగి 1,43,558 యూనిట్లకు చేరుకున్నాయి. కిందటేడాది ఏప్రిల్‌లో ఈ నెంబర్ 1,32,248 యూనిట్లుగా ఉంది. ఆల్టో, ఎస్– ప్రెస్సో వంటి చిన్న కార్ల అమ్మకాలు మాత్రం 18 శాతం పడిపోయి 14,110 యూనిట్లుగా రికార్డయ్యాయి. స్విఫ్ట్, సెలెరియా, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్ల సేల్స్ మాత్రం 27 శాతం పెరిగి 74,935 యూనిట్లకు పెరిగాయి. కిందటేడాది ఏప్రిల్‌లో ఈ నెంబర్ 59,184 గా ఉంది. మారుతి సుజుకీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,017 మిడ్ సైజ్ సెడాన్ బండ్లను అమ్మింది. కిందటేడాది ఏప్రిల్‌లో ఈ నెంబర్ 579 గా రికార్డయ్యింది. బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎర్టిగా వంటి యుటిలిటీ వెహికల్స్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 8 శాత పెరిగి 36,754 యూనిట్లకు చేరుకున్నాయి. కిందటి నెలలో మారుతి సుజుకీ 16,971 బండ్లను ఎగుమతి చేసింది. కిందటేడాది ఏప్రిల్‌లో ఎక్స్‌పోర్ట్ చేసిన 18,413 యూనిట్లతో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ.
రెండో ప్లేస్‌లో హ్యుందాయ్..
హ్యుందాయ్ కిందటి నెలలో మొత్తం 58,201 బండ్లను అమ్మింది. కిందటేడాది ఏప్రిల్‌లో డిస్‌పాచ్ చేసిన 56,201 యూనిట్ల కంటే ఇది 3.5 శాతం ఎక్కువ. తాజాగా లాంచ్ చేసిన ఆల్ న్యూ వెర్నాకు మంచి స్పందన వస్తోందని, ఈ మోడల్ అమ్మకాలు రెండింతలు పెరిగాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. త్వరలో ఎస్‌యూవీ ఎక్స్‌టెర్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించింది. కంపెనీ లోకల్‌గా 49,701 బండ్లను అమ్మగా, కిందటేడాది ఏప్రిల్‌లో ఈ నెంబర్ 44,001 యూనిట్లుగా రికార్డయ్యింది. హ్యుందాయ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 8,500 యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ నెంబర్ 12,200 నుంచి తగ్గింది. దేశ కార్ల మార్కెట్‌లో హ్యుందాయ్ సెకెండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
ప్యాసింజర్ బండ్ల అమ్మకాలు పెరిగినా..
టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 4 శాతం పడిపోయాయి. కంపెనీ కిందటి నెలలో 69,599 బండ్లను అమ్మగా, కిందటేడాది ఏప్రిల్‌లో ఈ నెంబర్ 72,648 యూనిట్లుగా రికార్డయ్యింది. డొమెస్టిక్ మార్కెట్‌లో టాటా మోటార్స్ 68,514 బండ్లను డీలర్లకు డిస్పాచ్ చేసింది. కిందటేడాది ఏప్రిల్‌లో ఈ నెంబర్ 71,467 గా ఉంది. కంపెనీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ మాత్రం పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి 47, 107 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్ 27 శాతం తగ్గి 22,492 యూనిట్లుగా రికార్డయ్యాయి. కిందటేడాది ఏప్రిల్‌లో కంపెనీ 41,630 ప్యాసింజర్ బండ్లను, 30,838 కమర్షియల్ వెహికల్స్‌ను అమ్మింది.
టయోటా సేల్స్ తగ్గినయ్
టయోటా కిర్లోస్కర్ ఏప్రిల్ నెలలో 14,162 బండ్లను డీలర్లకు డిస్పాచ్ చేసింది. కిందటేడాది ఏప్రిల్‌లో రికార్డయిన 15,086 యూనిట్లతో పోలిస్తే కంపెనీ హోల్‌సేల్స్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 6 శాతం పడిపోయాయి. కంపెనీ 1,348 అర్బన్ క్రూయిజర్ హైరైడర్ బండ్లను కిందటి నెలలో ఎక్స్‌పోర్ట్ చేయగలిగింది. ఏప్రిల్ 24–28 మధ్య మెయింటెనెన్స్ కోసం ఫ్యాక్టరీలను షట్‌డౌన్ చేశామని టయోటా కిర్లోస్కర్ పేర్కొంది. మరోవైపు ఎంజీ మోటార్ సేల్స్ మాత్రం రెండింతలు పెరిగి 2,008 యూనిట్ల నుంచి 4,551 యూనిట్లకు చేరుకున్నాయి.
కియా సోనెట్‌కు డిమాండ్
కియా ఇండియా కిందటి నెలలో 23,216 యూనిట్లను అమ్మగలిగింది. కిందటేడాది సేల్ చేసిన 19,019 యూనిట్లతో పోలిస్తే కంపెనీ హోల్‌సేల్స్ తాజా ఏప్రిల్‌లో 22 శాతం పెరిగాయి. సోనెట్ మోడల్ సేల్స్ భారీగా పెరిగాయని, మొత్తం సేల్స్‌లో ఈ మోడల్ వాటా 9,744 యూనిట్లుగా ఉందని కియా ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. లోకల్‌గా అయితే సెల్టోస్ (7,213 యూనిట్లు) , కేరన్స్ (6,107 యూనిట్లు) బండ్ల అమ్మకాలు ఊపందుకున్నాయని వెల్లడించింది. కేవలం నాలుగేళ్లలోనే ప్రీమియం ఆటోమోటివ్ కంపెనీగా ఎదగడంతో పాటు కొత్త తరం బ్రాండ్‌లలో పాపులర్ అయ్యామని కియా పేర్కొంది. మరోవైపు నిస్సాన్ కిందటి నెలలో 2,617 యూనిట్లను డీలర్లకు డిస్పాచ్ చేసింది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ అమ్మకాలు 24 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి.
