పార్టీలకు అతీతంగా ధర్నా.. బీసీ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుతగలొద్దు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

పార్టీలకు అతీతంగా ధర్నా.. బీసీ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుతగలొద్దు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పార్టీలకు అతీతంగా ధర్నా చేస్తున్నామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం (ఆగస్ట్ 6) ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం (ఆగస్ట్ 5) జంతర్ మంతర్లో ధర్నా ఏర్పాట్లను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. 

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం కోసం జంతర్ మంతర్‎లో ధర్నా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ధర్నాకు బీజేపీ ఎంపీలు వస్తే ఆహ్వానిస్తామని.. పార్టీలకు అతీతంగా ఈ ధర్నా చేస్తున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్లకోసం పోరాడుతున్నామని.. బీసీ రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుతగలొద్దని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో పాల్గొనేందుకు వేలాది మంది తెలంగాణ ప్రజలు ఢిల్లీ తరలివస్తునన్నారని.. రేపటి ధర్నా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.