హైదరాబాద్: బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాముడి, హిందు దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని.. ఎక్కడ ఎన్నికలు వచ్చిన అక్కడ హిందు, ముస్లింలకు బీజేపీ గొడవలు పెడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ఓట్ల కోసమే బీజేపీ నాయకులు జైశ్రీరాం అంటున్నారని విమర్శించారు. తనకు ఓటేసి గెలిపించిన ప్రజల కష్ట సుఖలను గాలికి వదిలేసి కేవలం ఓట్ల కోసమే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పని చేస్తున్నాడని దుయ్యబట్టారు.
నిరుపేద ప్రజలకు ఉపాధిని కల్పించాలనే సదుద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం కరెక్ట్ కాదన్నారు. గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ జనవరి 26 తరువాత ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తోందని నిప్పులు చెరిగారు. మంగళవారం (జనవరి 20) కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహేష్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ గొప్ప పార్టీ అని.. అలాంటి పార్టీలో ఉండటం అదృష్టమని అన్నారు. కార్యకర్తల కృషి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్భందలు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తలు కృషి చేశారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని.. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక, ప్రతి గ్రామంలో సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ పాలనలో సర్పంచులదే మూడో స్థానమన్నారు.
