తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!

వరంగల్ రైతు సంఘర్షణ సభ సహా రైతు డిక్లరేషన్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందరి కృషి వల్ల సభ విజయవంతం అయ్యిందని చెప్పారు. రాజస్థాన్ ఉదయ్ పూర్  లో జరిగిన చింతన్ శిబిర్ లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. చింతన్ శిబిర్ లో తీసుకున్న అన్ని అంశాలను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానంతో సోనియా గాంధీకి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు విజయవంతంగా చేశామన్న రేవంత్..సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గాంధీభవన్ లో సమాచారం అందించాలన్నారు. 

వరంగల్ రైతు డిక్లరేషన్ ను జనం లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్. రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా మే 21 నుంచి నెల రోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజలతో చర్చించాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు. మే 21న ముఖ్య నాయకులు ఒక్కొక్క చరిత్రాత్మక గ్రామాలలో రైతు రచ్చబండ నిర్వహించాలన్నారు. టీపీసీసీ చీఫ్ గా తాను వరంగల్ జిల్లా జయశంకర్ సొంత గ్రామంలో నిర్వహించే రచ్చబండ సభలో పాల్గొంటానని తెలిపారు. 

హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయించి మిగతా 15 నియోజకవర్గాలలో 15 మంది ముఖ్య నాయకులను నియమించి రచ్చబండ సభలు విజయవంతం అయ్యేలా చూస్తామన్నారు. అక్టోబర్ 2 నుంచి జరగబోయే రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట తెలంగాణలో చేయాలని కోరాతామన్నారు.  డిజిటల్ మెంబర్ షిప్, వరంగల్ డిక్లరేషన్ తో తెలంగాణ కాంగ్రెస్ కు మంచి పేరొచ్చిందని.. రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా రాష్ట్రంలో చేపట్టి హ్యాట్రిక్  కొడుతామన్నారు. ఒక్క ఏడాది కష్టపడితే అధికారంలోకి వస్తామన్న రేవంత్..అధికారంలోకి వచ్చాక ప్రజలకు సేవలు అందించొచ్చన్నారు.

ఇక బీజేపీ, టీఆర్ఎస్ కాంగ్రెస్ డిక్లరేషన్ పై కౌంటర్ గా మాట్లాడాలి గానీ అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రెండు పార్టీలు అసలు విషయాన్ని పక్కన పెట్టి తిట్ల పురాణం ఎత్తుకున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలన నిజాం పాలన తరహాలో వుందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేస్తామని అమిత్ షా భయాందోళనకు గురిచేస్తున్నాడన్న రేవంత్ ముస్లిం వర్గంలో కూడా పేద ప్రజలున్నారన్నినారు.  తెలంగాణ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని చెబుతున్న బీజేపి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల ఖర్చును కేసీఆర్ సమకూరుస్తున్నాడని..అందుకే ఈగ వాలకుండా కాపాడుతోందని అన్నారు.
 

 

 

మరిన్ని వార్తల కోసం

ట్రోలింగ్ అవుతున్న అమితాబ్ పోస్టు.. ఇంతకు ఏముంది అందులో

టెస్ట్ డ్రైవ్ అన్నాడు.. కారు ఎత్తుకెళ్లాడు, 100 రోజుల తర్వాత

బ్యాంక్ చోరీ కేసులో కొత్త ట్విస్ట్..కోర్టులో ప్రత్యక్షం