తెలంగాణను పాకిస్తాన్‎లో విలీనం చేయాలని చూశారు

తెలంగాణను పాకిస్తాన్‎లో విలీనం చేయాలని చూశారు

హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో ప్రధాన ఘట్టమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 అంటే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజని.. ఆ స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. విమోచన దినోత్సవం సందర్భంగా రేవంత్ గాంధీభవన్‎లో జెండా ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘బ్రిటిషర్ల నుంచి భారత్‎కు స్వాతంత్ర్యం వచ్చినపుడు నిజాం పాలకులు తెలంగాణను ఇండియాలో విలీనం చేయకుండా పాకిస్తాన్‎లో విలినం చేయాలని చూశారు. అప్పుడు ప్రధాని జవహర్ లాల్ ఆదేశాలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో జరిపి తెలంగాణను భారత్‎లో విలీనం చేశారు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు. తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‎ది. ఇప్పుడు కొంతమంది కొత్త బిచ్చగాళ్ల వచ్చారు. వారికి ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. జవాహర లాల్ నెహ్రు నిర్ణయం వల్లనే తెలంగాణ విలీనం జరిగింది. ప్రధాన మంత్రి నిర్ణయాన్ని హోంశాఖ మంత్రి అమలు చేస్తారు. దాంతో బీజేపీ వాళ్ళు తెలంగాణ విలీనం హోంశాఖ మంత్రి సర్దార వల్లభాయ్ పటేల్ వల్లే జరిగింది అని చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా పని చేశారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి ఒక్క నాయకులు కూడా లేరు. అందుకే కాంగ్రెస్ నేతల పేర్లు వాడుకుంటున్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య, షాయబుల్లాఖాన్, రాంజీ, చాకలి అయిలమ్మ, కొమురం భీంల పోరాట స్ఫూర్తితో పని చేస్తాం. ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా అధికారికంగా జరుపుతాం’ అని రేవంత్ అన్నారు.