
హైదరాబాద్: రాష్ట్రంలో ఎప్పటికీ కేసీఆరే సీఎంగా ఉండడని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అప్పుడు ఇదే పోలీసులను పంపి ఐజీ ప్రభాకర్‌రావును ఇంట్లో నుంచి బయటకు గుంజుకొస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, హ్యాకర్లను పెట్టి మరీ ఫోన్లు రికార్డ్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చేపట్టిన చలో రాజ్‌భవన్ నిరసన కార్యక్రమం సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ‘‘ప్రభాకర్ గుర్తు పెట్టుకో బిడ్డ.. నువ్వు రాసుకో.. ఇదే పోలీసులను నీ ఇంటికి పంపించి బయటకు గుంజుకొస్తం. ఇక నుంచి లెక్కలేసుకో.. ఎప్పటికీ సీఎంగా కేసీఆరే ఉండడు. గోడ మీద గీతలు గీసుకో.. 730 రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ గడీలను కూల్చి మీ సంగతి తేలుస్తం.. వచ్చేది సోనియమ్మ రాజ్యమే” అని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ సర్కారు ఉండేది మరో రెండేళ్లు మాత్రమేనని రేవంత్ అన్నారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఆయనను హోంగార్డులను పంపించి అరెస్ట్ చేయిస్తామని చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇతర దేశాల పాస్ పోర్టులు తెచ్చుకుంటున్నారని, అయినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంటలిజెన్స్ ప్రభాకర్ రావు కూడా ఇతర దేశాల పాస్ పోర్టు తెచ్చుకోవాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గవర్నర్ తమిళి సైను కలిసి వినతిపత్రం ఇస్తామంటే.. ఆమె పాండిచ్చేరి వెళ్లారని, తమకు గవర్నర్, కేసీఆర్‌ల మీద నమ్మకం లేదని, అంబేద్కర్ మీదనే నమ్మకం ఉందని అన్నారు. అందుకే ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇస్తామని చెప్పారు.