వరి వద్దంటే ప్రాజెక్టులెందుకు?

వరి వద్దంటే ప్రాజెక్టులెందుకు?
  • కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్
  • పోరాటం చేస్తనని రైతుల చెవుల్లో పూలు పెడుతున్నవా?
  • బాయిల్డ్ రైస్ కొనాలని కోరబోమని లేఖ ఎట్లిచ్చినవ్?

హైదరాబాద్ ,వెలుగు: ‘‘తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనాల్సిందిగా ఇకపై కోరబోమంటూ కేంద్రానికి కేసీఆరే స్వయంగా లేఖ ఇచ్చిండు. ఆ మేరకు మీడియాముఖంగా బహిరంగంగా ఆయనే ఒప్పుకున్నడు. రాష్ర్ట  రైతుల విషయంలో ఏకపక్షంగా ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్ కు ఎవరిచ్చిన్రు? రైతు సంఘాలు, రైతు నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా కేంద్రానికి లేఖ ఎందుకిచ్చినట్టు?” అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘నీ కేసుల విషయంలో మోదీ సహకారం కావాలి. దానికి ప్రతిఫలంగానే రైతుల ప్రయోజనాలకు ఉరి వేసే ఈ లేఖ ఇచ్చినవా?’’ అని కేసీఆర్​ను ప్రశ్నించారు. ఆదివారం రేవంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ఇకపై అడగబోమని నువ్వే కేంద్రం ముందు మోకరిల్లినవ్. లేఖ ఇచ్చొచ్చినవ్. ఇప్పుడేమో రైతుల పక్షాన పోరాడుతనని బీరాలు పలుకుతున్నవ్. ఇది తెలంగాణ రైతులను మోసం చేసుడు కాదా?  కేంద్ర సాగు చట్టాలపై రైతులు ఏడాదిగా కొట్లాడుతుంటే నువ్వేమో మోదీతో ములాఖత్ కని, నీ పార్టీ ఆఫీసు శంకుస్థాపనకని పదేపదే ఢిల్లీ పొయినవ్. మోదీ, అమిత్ షాలను అలాయ్ బలాయ్ చేసుకున్నవు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు అగచాట్లు, కామారెడ్డి జిల్లాలో రైతు మృతి, వరి కోతకు టోకెన్ల వంటి సమస్యల మీద మాట్లాడుతవేమో అనుకుంటే నువ్వేమో ‘కేంద్రంతో కయ్యం’ అని ఎప్పట్లెక్కనే మళ్లా పాత పాటే పాడి సరిపెట్టినవ్. ‘నీ వల్ల ఏమీ కాదు’ అని నువ్వు చేతులెత్తేసినట్టు అందరికీ స్పష్టంగా అర్థమైంది. కేంద్రం, రాష్ట్రం కలిసే డ్రామాలాడుతున్నాయని రైతులకు ఇప్పటికే అర్థమైంది” అని దుయ్యబట్టారు.

వరి వద్దంటే ప్రాజెక్టులెందుకు?

రైతులను వరి వేయొద్దన్నప్పుడు ఇక సాగుకు 24 గంటల విద్యుత్ దేనికని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. ‘‘ఆరుతడి పంటలు వేస్తే 24 గంటల కరెంటు ఎవరికి అవసరముంటది? వరి వేయొద్దనెటోనివి లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు? వైన్ షాపుల లైసెన్సుల రెన్యువల్ మీద శ్రద్ధ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై నీకు లేదెందుకు? పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రం రూపాయి కూడా పెంచలేదన్న మాటలు అబద్ధం కాదా?” అని ప్రశ్నించారు.