కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు ప్రియాంకగాంధీ

కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు ప్రియాంకగాంధీ

తెలంగాణ రాష్ట్రంలో  ప్రచారానికి ప్రియాంక

ఆమె చరిష్మాతోనే ఎన్నికల బరిలోకి.. 

పాదయాత్ర చేయించేలా టీపీసీసీ ప్రతిపాదన

హామీల అమలుపై భరోసా ఇప్పించే యోచన

తరుచూ బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్

తెలంగాణ ఇచ్చిన పార్టీకి చాన్స్ ఇవ్వాలని అప్పీల్ 

హైదరాబాద్ :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చరిష్మాను వినియోగించుకోవాలని టీ పీసీసీ యోచిస్తోంది. కర్నాటక విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. గాంధీ–నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రియాంకను రంగంలోకి దించడం ద్వారా సక్సెస్ కావాలనుకుంటున్నది. టీపీసీసీ ముఖ్యనాయకులు ప్రియాంక గాంధీతో ఈ విషయమై ఇప్పటికే చర్చించారని సమాచారం. ఇక్కడ జరిగే బహిరంగ సభలకు తరుచూ వచ్చిపోతుండాలని ఆమెను కోరినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కూతురిగా ఇక్కడ ఆమెను ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నిస్తూనే.. ఇప్పటి వరకు చేసిన డిక్లరేషన్స్, గెలిస్తే అమలు చేయబోయే పథకాలపై ప్రియాంకతో భరోసా ఇప్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 
   
10 రోజుల పాటు పాదయాత్ర?

ప్రియాంక గాంధీతో వారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో పాదయాత్ర చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనను ఏఐసీసీ నేతలు ఇప్పటికే ప్రియాంక ముందుంచినట్టు తెలిసింది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైతం ప్రియాంక చరిష్మా తెలంగాణలో గెలుపునకు పెద్ద సపోర్ట్ అవుతుందని సూచించినట్టు  తెలుస్తోంది. ఈ పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రియాంక గాంధీతో అప్పీల్ చేయించాలని పీసీసీ భావిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరాలనుకుంటున్నది. 

త్రిముఖ వ్యూహం

సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం, ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై బలమైన వాదన వినిపించే సత్తా ప్రియాంక గాంధీకి ఉన్నదని టీపీసీసీ భావిస్తోంది. గాంధీ–నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కావడం, ఇందిరాగాంధీ లాంటి పోలికలు కలిగి ఉండటం, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బిడ్డ కావడం గెలుపునకు కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. 

బలమైన వాదన వినిపిస్తే సక్సెస్

తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. విషయాన్ని కాంక్రీట్ గా చెప్పగలగడంతోపాటు భరోసా ఇచ్చే నేతలనే ఆదరిస్తున్నారని టీపీసీసీ నేతలు ఏఐసీసీకి తెలిపినట్టు సమాచారం. 1983లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్ చరిష్మా పనిచేసిందని, పార్టీ పెట్టి నెలల వ్యవధిలోనే అధికారం చేజిక్కించుకున్నదని చెబుతున్నారు. 1989లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటున్నారు. ఆ తర్వాత టీడీపీ మరో మారు అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ పతనం తర్వాత చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు విశ్వసించారని అంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ చరిష్మా కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని, వాగ్ధాటి కలిగి, ప్రజలకు భరోసా ఇవ్వగలిగిన నేత కావడంతోనే ఆయన రెండు సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తేగలిగారని అంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్( గతంలో టీఆర్ఎస్) విజయం సాధించడానికి కేసీఆర్ కు ఉన్న చరిష్మాయే కారణమని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఓటర్లకు ఒక భరోసా ఇవ్వగలిగే నేత కావాలని,  ఆ నేత ప్రియాంక అయితే బాగుంటుందని టీపీసీసీ భావిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రియాంక చరిష్మా తెలంగాణలో గెలుపునకు బాటలు వేస్తుందని టీపీసీసీ భావిస్తోంది. ఆ తర్వాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రియాంక చరిష్మా ఉపయోగ పడుతుందని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.