కాంగ్రెస్ అధికార ప్రతినిధుల నోటికి తాళం

కాంగ్రెస్ అధికార ప్రతినిధుల నోటికి తాళం
  • టీవీ చర్చలకు నో
  • పార్టీ అధికార ప్రతినిధులకు టీపీసీసీ ఆదేశం
  • రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడడమే కారణం?
  • పార్టీ నిర్ణయంపై పలువురి నేతల్లో వ్యతిరేకత

హైదరాబాద్, వెలుగు: పార్టీ అధికార ప్రతినిధుల నోటికి టీపీసీసీ తాళం వేసింది. పార్టీ తరపున ఇక నుంచి టీవీ చర్చల్లో పాల్గొనకూడదంటూ పార్టీ అధికార ప్రతినిధులకు హుకుం జారీ చేసింది. గాంధీభవన్​లో జరిగిన అధికార ప్రతినిధుల సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి టీపీసీసీ తరపున ఈ ఆదేశాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఇచ్చిన మౌఖిక ఆదేశాల ప్రకారమే అధికార ప్రతినిధుల నోటికి తాళం వేసినట్లు సమాచారం.

హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు సంబంధించి ఉత్తమ్​పై రేవంత్​రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్​ పార్టీలో తీవ్ర దుమారం రేగింది. రేవంత్​రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ ​ఇప్పటికే  సీరియస్​గా ఉన్నారు. దీనికి తోడు టీవీ చర్చల్లో పాల్గొనే పలువురు అధికార ప్రతినిధులు రేవంత్​రెడ్డికి మద్దతుగా మాట్లాడడం కూడా ఉత్తమ్​కుమార్​రెడ్డికి నచ్చడం లేదని, అందువల్లే టీవీ చర్చలకు నో చెప్పారని పార్టీ శ్రేణులు పలువురు చెబుతున్నారు.

ఇటీవల ఓ టీవీ చర్చలో టీపీసీసీ నేత మానవతారాయ్​ మాట్లాడుతూ రేవంత్​రెడ్డి జననేత అని, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని, యువకులు కూడా అదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇదేవిధంగా చాలామంది నేతలు టీవీ చర్చల్లో రేవంత్​రెడ్డికి మద్దతుగా మాట్లాడడం ఉత్తమ్​కు కోపం తెప్పించినట్లు సమాచారం. ఉత్తమ్​పై  రేవంత్​రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా టీవీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్​గాంధీ రాజీనామా చేసిన సమయంలో ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా టీవీ చర్చలపై ఏఐసీసీ నిషేధం విధించింది. అదే సమయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతుండండంతో పార్టీ తరపున వాణిని బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో టీవీ చర్చలపై నిషేధాన్ని ఎత్తివేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్​ ఏఐసీసీ పెద్దలను అప్పట్లో కోరారు. తెలంగాణలో అప్పటి నుంచి నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ.. ఏఐసీసీ నుంచి ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలు రానప్పటికీ  ఉత్తమ్​  నిర్ణయాన్నే అధికార ప్రతినిధులకు మల్లు రవి వెల్లడించారని తెలుస్తోంది.

అధికార ప్రతినిధుల నుంచి వ్యతిరేకత

టీపీసీసీ తీసుకున్న నిర్ణయంపై పార్టీ అధికార ప్రతినిధులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్​ పార్టీ నుంచి చర్చలకు ఎవరూ రావడం లేదని, కాంగ్రెస్​ నుంచి కూడా వెళ్లకపోతే బీజేపీ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని మల్లు రవికి సూచించినట్లు సమాచారం. పార్టీకి గడ్డుకాలం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీవీ చర్చలకు పోవద్దంటూ ఆంక్షలు విధించడం ఏంటని అధికార ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు రెడీ: మల్లు రవి

హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు కాంగ్రెస్​ పార్టీ సిద్ధంగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. గాంధీభవన్​లో జరిగిన టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశం అనంతరం ఆ వివరాలను మీడియాకు ఆయన వివరించారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికకు సంబంధించిన అంశాన్ని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. హుజూర్​నగర్​లో పనిచేసేందుకు 90 శాతం మంది పార్టీ అధికార ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు.

యురేనియం తవ్వకాల విషయంలో స్టేట్​ వైల్డ్​ లైఫ్​ బోర్డ్​ సమావేశం ఏర్పాటు చేసి అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. బొగ్గుగనుల వల్లే ఎక్కువ నష్టం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్​ పార్టీ హయాంలోనే యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది నిజమేనని, కడపలో నష్టం చూశాక దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి యురేనియం అనుమతులను రద్దు చేయించాలన్నారు. యురేనియం తవ్వకాలకు నిరసనగా అచ్చంపేట నుంచి చలో ప్రగతి భవన్​ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.