బీఆర్​ఎస్​ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయ్..

బీఆర్​ఎస్​ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయ్..

తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్తు అంశంపై బీఆర్​ఎస్​ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. జులై 15న ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తోందని రేవంత్​ అన్నారు.

ALSO READ :సీఎం కేసీఆర్​కు ఎవరైనా ప్రశ్నిస్తే నచ్చదు.. : ఆకునూరి మురళీ

బీఆర్​ఎస్​ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రైతాంగానికి ఫ్రీ కరెంట్​ ఇవ్వడం కాంగ్రెస్​ పార్టీ పేటెంట్​హామీ అని అన్నారు.  మంత్రి హరీశ్​రావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్​రెడ్డి తదితరులు కాంగ్రెస్​ పార్టీపై చేస్తున్న ఆరోపణలపై రేవంత్​స్పందిస్తూ.. బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధుల వాదనలో పస లేదని అన్నారు.  

1999లో కాంగ్రెస్​ మేనిఫెస్టోలోనే ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.  ఉచిత విద్యుత్తుపై బీఆర్​ఎస్​ నేతలవి చావు కేకలని విమర్శించారు. 

కేసీఆర్​ ఆదేశాల మేరకు బషీర్​బాగ్​ కాల్పులు

కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు విద్యుత్తు సరఫరా సక్రమంగా చేయాలని  200‌‌0 ఆగస్టు 20 రోజు  శాసనసభ ముట్టడికి పిలుపునిచ్చాయన్నారు.  ఆ ముట్టడిని నిలువరించడానికి బషీర్​బాగ్​లో రైతులపై కాల్పులు జరిపారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఇంకా ఎంతో మంది రైతులు గాయపడ్డారని గుర్తు చేశారు. అప్పుడు ఆ పార్టీలో ప్రస్తుత సీఎం కేసీఆర్​ హెచ్​ఆర్డీగా ఉన్నారని అన్నారు.

కేసీఆర్ సూచనల్నే చంద్రబాబు  అమలు చేసి ఉచిత కరెంటు ఇవ్వడం కుదరదని.. కొత్త మీటర్లు బిగిస్తామని రైతులకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పరిస్థితి కాల్పుల వరకు వెళ్లిందని అన్నారు.  టీడీపీ హయాంలో కేసీఆర్, గుత్తా తదితరులు కీలక పదవుల్లో ఉన్నారన్నారు.  

వీటిన్నింటికీ కేసీఆర్​ కారణం కాదా అని ప్రశ్నించారు.తనని టీడీపీ అనుచరుడిగా బీఆర్​ఎస్​ నేతలు వ్యాఖ్యలు చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. ఇండిపెండెంట్​గా గెలిచాకే టీడీపీలో చేరానన్నారు. పదవుల కోసం కేసీఆర్.. చంద్రబాబు చెప్పులు మోశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పదవి ఇవ్వకపోవడంతో ఓ ఆంధ్ర రాజకీయ నాయకుడి ఆర్థిక సాయంతో బీఆర్​ఎస్​ పార్టీని పెట్టారని అన్నారు.