
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కొత్త ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షి నియమితులైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. బుధవారం గాంధీ భవన్‌లో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ నేతృత్వంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, ఎన్నికల కమిటీ సభ్యులు, మంత్రులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి కార్యవర్గ సమావేశం ఇదే కావడం విశేషం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలే ఎజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 15 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన చర్యల తదితరాలపై చర్చించనున్నట్టు తెలిసింది.
రెండుసార్లు వాయిదా
ఈ సమావేశం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. అంతకుముందు గతేడాది డిసెంబర్ 23న పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినా.. ఇన్‌చార్జ్‌లను మార్చడంతో ఆ మరుసటి రోజు (డిసెంబర్ 24)కు వాయిదా వేశారు. ఆ రోజు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఉండటంతో మళ్లీ పోస్ట్‌పోన్ అయింది. ఈ క్రమంలో తాజాగా బుధవారం సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌కు దీపాదాస్
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా నియమితులయ్యాక తొలిసారిగా దీపాదాస్ మున్షి హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రొటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, రోహిన్ రెడ్డి, గౌరీ సతీశ్ తదితరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.