అదే ఉద్యమ స్ఫూర్తితో సన్నవడ్ల మద్ధతు ధర కోసం పోరాడాలి

అదే ఉద్యమ స్ఫూర్తితో సన్నవడ్ల మద్ధతు ధర కోసం పోరాడాలి

జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వ‌ల్ల తెలంగాణ రైతులు ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శ‌నివారం జ‌గిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో రైతులతో కాంగ్రెస్ నేతల ముఖాముఖి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజరైన పొన్నం మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో మార్పులు చేయాలని త‌మ నాయ‌కుడు రాహుల్ గాంధీ రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తే బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదన్నారు. బిఎస్ఎన్ఎల్ , ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాలు, ఎల్ఐసి, బీపీసీల్, రైల్వే స్టేషన్స్ వంటి సంస్థలన్నీ ప్రయివేటుకు అప్పగించినట్లుగానే.. వ్యవసాయాన్ని కూడా వ్యాపారం చేయాలని కేంద్రం చూస్తున్నద‌న్నారు. రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకునే వీలు కల్పించిన కేంద్రం… మద్ధతు ధర కంటే తగ్గకుండా పంటలు అమ్ముకునేలా చట్టాన్ని మార్చాలి.

రైతులను పాలేర్లుగా మార్చే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపట్టిందన్నారు. గతంలో వ్యాపారుల వద్ద నిత్యావసర వస్తువుల నిల్వలు ఉంటే కేసులు అయ్యేవి. ఇప్పుడు ఆ నిబంధనను తొలగించడంతో బ్లాక్ మార్కెట్ కు సరుకులు వెళ్లే ప్రమాదముంద‌న్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం.. రెండు ఏళ్ళు గడిచినా ఇంతవరకూ అమలు చేయ‌లేద‌న్నారు. సన్న రకం వడ్లు, పత్తి పంటల సాగు బలవంతంగా చేయించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మొక్కజొన్నకు మద్ధతు ధర సాధించేందుకు జగిత్యాల రైతులు చేసిన ఉద్యమ స్ఫూర్తితో సన్నవడ్లకు కూడా మద్ధతు ధర కోసం పోరాడాలని అన్నారు

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్ర‌భుత్వం ఆదుకోవాలని,. రంగు మారిన ధాన్యం, పత్తి కొనుగోలు చేయాలని పొన్నం అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఊసేలేదని అన్నారు. రైతుబంధు పేరిట రూ. 5000 ఇచ్చినట్టే ఇచ్చి ఎల్ఆర్ఎస్ పేరిట ముక్కుపిండి వసూలు చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామ‌ని చెప్పారు.